ఇది విచ్చిన్నం చేయాలనే కుట్ర : షమీ

23 Mar, 2018 19:20 IST|Sakshi
మహ్మద్‌ షమీ

సాక్షి, స్పోర్ట్స్‌‌: తన కుటుంబాన్ని విచిన్నం చేయడానికి ఎవరో కుట్ర పన్నుతున్నారని టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ ఆరోపించాడు.  తన భార్య హసీన్‌ జహాన్‌ చేసిన గృహ హింస ఆరోపణలు, క్రిమినల్‌ కేసులు, కాంట్రాక్ట్‌ నిలిపివేతలతో పాటు ఫిక్సింగ్‌ తరహా వివాదంతో గత రెండు వారాలుగా షమీ ఉక్కిరిబిక్కిరవుతున్న విషయం తెలిసిందే. ఫిక్సింగ్‌ ఆరోపణలతో విచారణ చేపట్టిన బీసీసీఐ అవినీతి వ్యతిరేక విభాగం (ఏసీయూ) షమీకి గురువారం క్లీన్‌చీట్‌ ఇచ్చింది. 

ఈ సందర్భంగా షమీ మీడియాతో మాట్లాడుతూ.. తనపై, తన కుంటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తూ తన కుటుంబాన్ని విచ్చిన్నం చేయాలని ఎవరో కుట్ర చేస్తున్నారని ఆరోపించాడు. ఈ అసత్య ఆరోపణలపై న్యాయబద్దంగా పోరాటం చేస్తానన్నాడు. ఇక నుంచి క్రికెట్‌పై పూర్తిగా దృష్టి సారిస్తానని, నా కోపాన్నంతా సానుకూల ధోరణితో ఆటలో చూపిస్తానన్నాడు. ఇకపై తన బౌలింగ్‌ గురించే మాట్లాడుకునేలా చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. తనే తప్పు చేయలేదని, బీసీసీఐకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని ఈ స్టార్‌ క్రికెటర్‌ చెప్పుకొచ్చాడు.
 
ఏసీయూ రిపోర్ట్‌తో బీసీసీఐ షమీని వార్షిక వేతనాల కాంట్రాక్టు జాబితాలో చోటు కల్పించిది. అంతేగాకుండా షమీ ఐపీఎల్‌లో పాల్గొనడంపై కూడా మార్గం సుగుమమైంది. ఫిక్సింగ్‌ ఆరోపణల్లో క్లీన్‌చీట్‌ వచ్చినా షమీపై ఉన్న గృహహింస కేసులు, పలు ఆరోపణలపై కోల్‌కతా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇక మరోవైపు హసీన్‌ జహాన్‌ మ్రాతం వెనక్కి తగ్గడం లేదు. ఫిక్సింగ్‌ ఆరోపణలు చేయలేదని, కేవలం డబ్బులు మాత్రమే తీసుకున్నాడని చెప్పానని తెలిపిన ఆమె షమీ విషయంలో తనకు న్యాయం చేయాలని  శుక్రవారం పశ్చిమ బెంగాల్‌  ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసారు.

మరిన్ని వార్తలు