బూమ్రా స్థానంలో సిరాజ్‌

8 Jan, 2019 12:33 IST|Sakshi

న్యూఢిల్లీ: గతేడాది మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో చివరిసారి కనిపించిన హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆసీస్‌ వన్డే సిరీస్‌లో భాగంగా మహ్మద్‌ సిరాజ్‌ను ఉన్నపళంగా జట్టులో చేర్చుతూ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు సంబంధించి జట్టును గతంలోనే ప్రకటించినప‍్పటికీ, కొన్ని మార్పులు చేయాల్సి రావడంతో సిరాజ్‌ను ఎంపిక చేసింది. ఆసీస్‌ వన్డే సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌ పర్యటనకు బూమ్రాకు విశ్రాంతి ఇస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.  కెప్టెన్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రిల సూచనతో బూమ‍్రాకు విశ్రాంతి ఇచ్చేందుకు సెలక్టర్లు అంగీకరించారు.

దాంతో బూమ్రా స్థానంలో సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తన అధికారిక ట్వీటర్‌ అకౌంట్‌లో స్పష్టం చేసింది. ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20లు మాత్రమే ఆడిన సిరాజ్‌.. ఆసీస్‌తో వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేయనున్నాడు. అదే సమయంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధార్ధ్‌ కౌల్‌కు అవకాశం కల్పించారు సెలక్టర్లు. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ తర్వాత విరాట్‌ కోహ్లి గ్యాంగ్‌ న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. కివీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌తో పాటు మూడు టీ20 సిరీస్‌లో భారత్‌ పాల్గొనుంది.


మరిన్ని వార్తలు