ఆత్మహత్య ఆలోచనలో నా భార్య గుర్తొచ్చింది..

25 Apr, 2020 13:07 IST|Sakshi

సిడ్నీ: మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఆస్ట్రేలియా క్రికెటర్‌ మోజెస్ హెన్రిక్స్‌ పేర్కొన్నాడు. ఒకానొక సమయంలో ఏం చేయాలో అర్థం కాక జీవితాన్ని ముగించాలని ఫిక్స్‌ అయిపోయినట్లు చెప్పుకొచ్చాడు. వేగంగా కారును డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లి పిల్లర్‌ ఢీకొట్టి ఆత్మహత్యకు యత్నిద్దామని అనుకున్నట్లు తెలిపాడు. తాను కారులో డ్రైవ్‌ చేసుకుంటూ ఇంటికొచ్చే సమయంలో ఈ ఆలోచన వచ్చిందన్నాడు. అయితే తన భార్య క్రిష్టాతో​ పాటు కుటుంబం గుర్తుకు రావడంతో ఆత్మహత్య ఆలోచనను నుంచి బయటకు వచ్చానన్నాడు. ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘ నేను మానసికంగా చాలా సతమతమయ్యా. మానసిక ఆందోళన లక్షణాలను గూగుల్‌ శోధించి మరీ అవునా..కాదా అని తెలుసుకున్నా. నాలో మానసిక ఆందోళన లక్షణాలు ఎక్కువగా ఉన్నాయనిపించింది.  (ఆన్‌లైన్‌ పాఠాల్లో అశ్లీల చిత్రాల కలకలం..!)

ఎక్కువ సేపు పడుకోవాలని ఉండేది. మందులు కోసం తీవ్రంగా ప్రయత్నించా. విశ్రాంతి తీసుకోవడానికి మత్తు మందులు వాడాలనిపించింది. అసలు ఆలోచనలు లేకుండా ఉండటం కోసం మందులు వేసుకోవాలనుకునే వాడిని. ఇలా ఒకానొక సమయంలో బ్యాంక్స్‌టౌన్‌ నుంచి ఇంటికి కారులో వస్తుండగా చనిపోవాలని అనిపించింది. 110 కి.మీ వేగంతో వెళ్లి పోల్‌ను ఢీకొట్టాలనుకున్నా. ఏదో ప్రమాదంలా కాకుండా నేరుగా వెళ్లి పోల్‌ గుద్దేయాలనుకున్నా. అప్పుడు అలా చేయడం కరెక్ట్‌ కాదనిపించింది. నా సోదరులను వదిలి ఎలా వెళ్లి పోగలను. నా భార్యను ఒంటిరిని చేసి ఆత్మహత్య చేసుకోవడం సరైనది కాదనిపించింది. నన్ను ప్రేమించే వారి కోసం బతకాలనుకున్నా. దాంతో ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. ఆ ఆలోచన నుంచి బయటపడటానికి రెండు రోజుల పాటు 10 మందితో కూడిన నా జట్టుతోనే ఉన్నా’ అని హెన్రిక్స్‌ తెలిపాడు. (నాతో తప్పుగా ప్రవర్తిస్తావా అన్నాడు ..!)

మరిన్ని వార్తలు