క్రీడలకు మరింత ప్రోత్సాహం

1 Sep, 2017 00:43 IST|Sakshi
క్రీడలకు మరింత ప్రోత్సాహం

కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో క్రీడలకు మోదీ సర్కార్‌ అధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర క్రీడల మంత్రి విజయ్‌ గోయల్‌ అన్నారు. ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన పీవీ సింధు, సైనా నెహ్వాల్‌తో పాటు శ్రీకాంత్‌ను గురువారం ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విజయ్‌ గోయల్‌ మాట్లాడుతూ... దేశంలో క్రికెట్‌ స్థాయిలో బ్యాడ్మింటన్‌కు గుర్తింపు రావడానికి సైనా, సింధులే ప్రధాన కారణమని కొనియాడారు. తమ ఆటతీరుతో కోట్లాది మంది మనుసులు గెలుచుకున్న వీరు మహిళలు క్రీడలపై దృష్టి సారించడానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు.

దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా వీరిని తీర్చిదిద్దిన కోచ్‌ గోపీచంద్, విమల్‌కుమార్‌లను ఆయన అభినందించారు. క్రీడల గురించి ఆలోచించిన మొదటి ప్రధాని నరేంద్ర మోదీయే అని జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు కూడా ప్రధాని వాకబు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహంతో అంతర్జాతీయ టోర్నీల్లో మరింతగా రాణిస్తామని సైనా, సింధు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు