ఇంగ్లండ్‌ వచ్చేసింది

9 Jan, 2017 00:17 IST|Sakshi
ఇంగ్లండ్‌ వచ్చేసింది

ప్రాక్టీస్‌లో మోర్గాన్‌ బృందం 
రేపు ఇండియా ‘ఎ’తో వార్మప్‌ మ్యాచ్‌


ముంబై: ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు సెలవులు పూర్తయిపోయాయి. భారత్‌ చేతిలో టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన తర్వాత స్వదేశానికి వెళ్లిన ఆ జట్టు,  క్రిస్మన్, కొత్త సంవత్సర సంబరాల తర్వాత మరోసారి టీమిండియాతో పోరుకు ఇక్కడకు చేరుకుంది. ఇయాన్‌ మోర్గాన్‌ నాయకత్వంలోని పరిమిత ఓవర్ల జట్లు భారత గడ్డపై వన్డే, టి20 సిరీస్‌లు ఆడేందుకు ముంబైలో అడుగు పెట్టాయి. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. టెస్టుల్లో ఆడిన టీమ్‌ నుంచి తొమ్మిది మంది ఆటగాళ్లు ఈ జట్లలోనూ ఉండగా, ఆ సిరీస్‌లో ఆడని కొత్త ఆటగాళ్లు ఇప్పుడు తమ జట్టుతో కలిసి వచ్చారు. వన్డే సిరీస్‌కు ముందు మంగళవారం ఇంగ్లండ్, భారత్‌ ‘ఎ’తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఈ నేపథ్యంలో జట్టు ఆదివారం తొలిసారి బ్రాబోర్న్‌ స్టేడియంలో నెట్‌ ప్రాక్టీస్‌లో పాల్గొంది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్‌కు ఆలస్యంగా రానున్న జో రూట్‌ మినహా మిగతా ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు. దాదాపు మూడు గంటల పాటు వారి సాధన సాగింది. రూట్‌ గురువారం జట్టుతో చేరతాడు.

సాధనలో యువరాజ్‌...
మూడేళ్ల తర్వాత భారత వన్డే జట్టులోకి ఎంపికైన యువరాజ్‌ సింగ్‌ వార్మప్‌ మ్యాచ్‌తో తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం జరిగే మ్యాచ్‌ కోసం అతను నెట్స్‌లో చాలా సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. అతనితో పాటు శిఖర్‌ ధావన్‌ కూడా సాధన చేశాడు. వార్మప్‌ మ్యాచ్‌లో ‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోని మాత్రం ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. అక్టోబర్‌లో కివీస్‌తో వన్డే తర్వాత మైదానంలోకి దిగని ధోని, మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం వార్మప్‌ పోరులో పాల్గొంటున్నాడు. భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి వన్డే ఈ నెల 15న పుణేలో జరుగుతుంది.  

భారత జట్టును వారి సొంతగడ్డపై ఓడించడం ఏ ప్రత్యర్థికైనా చాలా కష్టం. అయితే ఈ సవాల్‌కు మేం  సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మా  కుర్రాళ్లు చాలా నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. సిరీస్‌ కోసం నేనూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాను. సొంతగడ్డపై భారత్‌ చాలా బలమైన జట్టు. అయితే మేం వారినే ఓడించే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాం. ఇది మాకు పెద్ద సవాల్‌వంటిది. చిన్న సిరీసే అయినా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. టెస్టు  సిరీస్‌లో తాము ఘోరంగా విఫలమైనా, ఫార్మాట్‌ మారడంతో మా ఆట కూడా మారుతుందని విశ్వాసంతో ఉన్నాను. –ఇయాన్‌ మోర్గాన్, ఇంగ్లండ్‌ కెప్టెన్‌