ఆసీస్‌ కుదేల్‌... సఫారీలు జిగేల్‌

26 Mar, 2018 03:31 IST|Sakshi
మోర్కెల్‌ను అభినందిస్తున్న సహచరులు

ఆసీస్‌పై 322 పరుగులతో దక్షిణాఫ్రికా ఘన విజయం

సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి మోర్నీ మోర్కెల్‌కు ఐదు వికెట్లు  

కేప్‌టౌన్‌: వివాదంతో ఏకాగ్రత చెదిరింది... ఆటగాళ్లపై నిషేధంతో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది... ప్రదర్శన అట్టడుగుకు పడిపోయింది... ఫలితం ఆస్ట్రేలియా దారుణ పరాజయం. బాల్‌ ట్యాంపరింగ్‌ ఘటనతో తీవ్ర ఒత్తిడిలో పడిపోయిన ఆ జట్టును... మరింత కుదేలు చేస్తూ మూడో టెస్టులో దక్షిణాఫ్రికా 322 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2–1తో ముందంజ వేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీసిన మోర్నీ మోర్కెల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  


ఇక్కడి న్యూలాండ్స్‌ మైదానంలో నాలుగో రోజు 430 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్‌ పేలవ ఆటతీరుతో 107 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్‌ ఏ దశలోనూ ఆశావహంగా కనిపించని కంగారూలు కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేకపోయారు. వార్నర్‌ (32), బాన్‌క్రాఫ్ట్‌ (26) తొలి వికెట్‌కు 57 పరుగులు జత చేసినా... ఆ తర్వాత 50 పరుగుల వ్యవధిలోనే 10 వికెట్లూ కోల్పోయి ఘోర పరాభవం ఎదుర్కొన్నారు. మోర్నీ మోర్కెల్‌ (5/23) పదునైన పేస్‌తో, కేశవ్‌ మహరాజ్‌ (2/32) స్పిన్‌తో ప్రత్యర్థి పనిపట్టారు.

ఓపెనర్లు మినహా మిచెల్‌ మార్‌‡్ష (16) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. స్మిత్‌ (7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 238/5తో ఆదివారం ఉదయం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా డికాక్‌ (65; 8 ఫోర్లు, 1 సిక్స్‌), ఫిలాండర్‌ (52 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలతో 373 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 56తో కలుపుకొని ఆసీస్‌ ముందు 430 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇరు జట్ల  మధ్య చివరిదైన నాలుగో టెస్టు జొహన్నెస్‌బర్గ్‌లో ఈ నెల 30న మొదలవుతుంది. 

మరిన్ని వార్తలు