ఐదో సఫారీ బౌలర్‌గా..

24 Mar, 2018 12:05 IST|Sakshi

కేప్‌టౌన్‌: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ తర్వాత తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు చెప్పబోతున్న దక్షిణాఫ్రికా ఫాస్ట్‌ బౌలర్‌ మోర్నీ మోర్కెల్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తరపున మూడొందల టెస్టు వికెట్లు సాధించిన ఐదో బౌలర్‌గా మోర్కెల్‌ గుర్తింపు సాధించాడు. ఆసీస్‌తో సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు రెండో రోజు ఆటలో మోర్కెల్‌ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. తద్వారా మూడొందల టెస్టు వికెట్ల క్లబ్‌లో మోర్కెల్‌ చేరిపోయాడు.

శుక్రవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. బెన్‌క్రాఫ్ట్‌ (77) అర్ధ సెంచరీతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా పేసర్లు మోర్నీ మోర్కెల్‌ (4/87), రబడ (3/81) ధాటికి ఆసీస్‌ ఒక దశలో 175 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. అయితే ఎదురుదాడికి దిగిన లయన్‌ సఫారీలను అడ్డుకున్నాడు. 8 ఫోర్లతో 47 పరుగులు చేసిన అతను, పైన్‌ (33 బ్యాటింగ్‌)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 66 పరుగులు జోడించాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా 311 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు అజేయంగా నిలిచిన ఎల్గర్‌ (141 నాటౌట్‌) మూడో సారి ఈ ఘనత సాధించి విండీస్‌ దిగ్గజం హేన్స్‌తో సమంగా నిలవడం విశేషం.

మరిన్ని వార్తలు