ఆసీస్‌తో ఆఖరి ఆట

27 Feb, 2018 00:55 IST|Sakshi
కుటుంబంతో మోర్నీ మోర్కెల్‌

 క్రికెట్‌కు వీడ్కోలు చెబుతానన్న మోర్నీ మోర్కెల్‌  

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా పేసర్‌ మోర్నీ మోర్కెల్‌ త్వరలోనే ఆటకు టాటా చెప్పనున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతానని మోర్కెల్‌ సోమవారం ప్రకటించాడు. ‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. అయితే వీడ్కోలుకు ఇదే సరైన సమయం. ఇకపై క్రికెట్‌లేని జీవితాన్ని కొత్తగా ఆస్వాదిస్తా. నాకో మంచి కుటుంబం ఉంది. నేను, నా విదేశీ భార్య అంతర్జాతీయ క్రికెట్‌ షెడ్యూల్‌ బడలికల నుంచి విముక్తులమవుతున్నాం. క్రికెట్‌ భారాన్ని దించేసి వ్యక్తిగత జీవితంలో ముందడుగు వేయదల్చుకున్నా’ అని 33 ఏళ్ల మోర్కెల్‌ తన రిటైర్మెంట్‌ సందేశంలో పేర్కొన్నాడు. ప్రొటీస్‌ జెర్సీ ధరించి ఎన్నో మధుర క్షణాలను అనుభవించానని... దక్షిణాఫ్రికాకు ఆడిన ప్రతీ మ్యాచ్‌ను, ప్రతీ క్షణాన్ని ఆస్వాదించినట్లు తెలిపాడు. ‘నా క్రికెట్‌ ప్రయాణంలో సఫారీ బోర్డు, జట్టు సహచరులు, కుటుంబసభ్యులు, మిత్రులు ఎంతో తోడ్పాటు అందించారు.

నాలో ఇంకా క్రికెట్‌ ఆడే సత్తా ఉంది. దాన్ని ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో ఉపయోగిస్తా. జట్టును గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’అని అన్నాడు. 2006లో డర్బన్‌లో భారత్‌తో జరిగిన టెస్టుతో అరంగేట్రం చేసిన మోర్కెల్‌ 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 529 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 117 మ్యాచ్‌లాడి 188 వికెట్లు తీశాడు. టి20ల్లో 44 మ్యాచ్‌లాడి 47 వికెట్లు పడగొట్టాడు. టెస్టు కెరీర్‌లో 83 మ్యాచ్‌లాడి 294 వికెట్లు చేజిక్కించుకున్నాడు. 2009లో ప్రధాన పేసర్‌ మఖాయ ఎన్తిని రిటైర్మెంట్‌ తర్వాత జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన మోర్కెల్‌ను ఈసారి వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు.    

మరిన్ని వార్తలు