‘నన్ను ఆస్ట్రేలియన్లు అసహ్యించుకున్నారు’

13 Sep, 2019 11:10 IST|Sakshi

లండన్‌:  గతేడాది భారత్‌తో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో ఆడిన ఆసీస్‌ ఆల్‌ రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ అప్పట్నుంచి టెస్టు ఫార్మాట్‌లో ఆడలేదు.  తరచు గాయాల బారిన పడటమే కాకుండా కొంతకాలం జీర్ణాశయ సంబంధిత రోగంతో బాధపడ్డాడు. దాంతో ఆసీస్‌ జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా చోటు సంపాదించడంలో విఫలమయ్యాడు. తాజాగా యాషెస్‌ సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు ద్వారా రీఎంట్రీ ఇచ్చిన మిచెల్‌ మార్ష్‌..  తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు సాధించి ఇంగ్లండ్‌ను కట్టడి చేశాడు. 

తన తాజా ప్రదర్శనపై మిచెల్‌ మాట్లాడుతూ.. ‘ నన్ను ఎక్కువ శాతం మంది ఆస్ట్రేలియన్లు అసహ్యించుకున్నారు. తరచు జట్టుకు దూరమవుతూ రావడంతో నన్ను కచ్చితంగా మా అభిమానులు అసహ్యించుకునే  ఉంటారు(నవ్వుతూ). క్రికెట్‌ను ఎక్కువ ప్రేమించే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. వారు ఎప్పుడూ మెరుగైన ప్రదర్శన ఇస్తేనే ఆటగాళ్లను గౌరవిస్తారు. మా ఫ్యాన్స్‌ ఆశల్ని నిరాశపరుస్తూనే వచ్చాను. పలు రకాలు సమస్యలు కూడా నన్ను క్రికెట్‌కు దూరంగా ఉంచాయి. నాకు చాలా ఎక్కువ అవకాశాలే వచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిస్థాయిలో సక్సెస్‌ కాలేదు. ఇప్పుడు నాకు తగినంత గౌరవం లభిస్తుందనే అనుకుంటున్నా. ఆసీస్‌కు క్రికెట్‌ను ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా. బ్యాగీ గ్రీన్‌ క్యాప్‌ను ధరించి ఆడటాన్ని  ప్రేమిస్తా. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తా’ అని మిచెల్‌ మార్ష్‌ పేర్కొన్నాడు.(ఇక్కడ చదవండి: ఇంగ్లండ్‌ 271/8)

మరిన్ని వార్తలు