సెరెనాను ఆపతరమా!

29 Jun, 2015 00:20 IST|Sakshi
సెరెనాను ఆపతరమా!

వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి
 గెలిస్తే రెండోసారి ఈ ఘనత
 నేటి నుంచి వింబుల్డన్ టోర్నమెంట్
 
 మూడు పదుల వయసు దాటినా వన్నె తగ్గని ఆటతీరుతో అలరిస్తున్న అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టింది. సోమవారం మొదలయ్యే సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో ఈ నల్లకలువ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మూడు వారాల క్రితం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్‌లో పూర్తి ఫిట్‌గా లేకున్నా... ప్రతికూల పరిస్థితులను అధిగమించి సెరెనా టైటిల్ నెగ్గిన తీరు అబ్బురపరిచింది. చివరిసారి 2012లో వింబుల్డన్‌లో విజేతగా నిలిచిన సెరెనా ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి మాత్రం ఆమె విన్నర్స్ ట్రోఫీతో తిరిగి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
 
 లండన్: గతేడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూ ఎస్ ఓపెన్... ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ సాధించిన సెరెనా విలియమ్స్ రెండోసారి అరుదైన ఘనత సాధించేందుకు సంసిద్ధమైంది. నేడు మొదలయ్యే వింబుల్డన్ టోర్నమెంట్‌లో ఈ అమెరికా స్టార్ విజేతగా నిలిస్తే రెండోసారి వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలను సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుం ది. తొలి రౌండ్‌లో క్వాలిఫయర్ మార్గరీటా గ్యాస్‌పర్యాన్ (రష్యా)తో ఆడనున్న 33 ఏళ్ల సెరెనాకు ఈ టోర్నీలో నాలుగో సీడ్ షరపోవా (రష్యా), రెండో సీడ్, డిఫెండింగ్ చాంపియన్  క్వి టోవా (చెక్ రిపబ్లిక్)ల నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. అయితే తన కెరీర్‌లో ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ఆమె అదే జోరును కొనసాగిస్తే మాత్రం ఆరోసారి విం బుల్డన్ చాంపియన్‌గా నిలిచే అవకాశాలున్నాయి. సెరెనా ఫేవరెట్‌గా కనిపిస్తున్నా... మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేని యా), ఐదో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్), ఆరో సీడ్ సఫరోవా (చెక్ రిపబ్లిక్), 11వ సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా), 18వ సీడ్ లిసికి (జర్మనీ)లను కూడా తక్కువ అంచనా వేయలేము.

 ఆ నలుగురిపైనే...: పురుషుల సింగిల్స్ విభాగానికొస్తే మళ్లీ ఆ నలుగురు (జొకోవిచ్, ఫెడరర్, నాదల్, ఆండీ ముర్రే) అగ్రశ్రేణి క్రీడాకారులపైనే అందరి దృష్టి ఉంది. 2012లో వింబుల్డన్ టైటిల్ నెగ్గిన తర్వాత ఫెడరర్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించలేకపోయాడు. ఈ ఏడాది ఈ స్విస్ దిగ్గజం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఫెడరర్ అన్ని రకాల కోర్టులపై (హార్డ్, క్లే, గ్రాస్) ఆడి ఐదు టైటిల్స్ సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌కు, వింబుల్డన్‌కు మధ్య తగినంత విరామం దొరకడంతో గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి పూర్తిస్థాయిలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సిద్ధమయ్యానని ఫెడరర్ అన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అనూహ్యంగా ఓడి ‘కెరీర్ స్లామ్’ ఘనతను అందుకోలేకపోయిన జొకోవిచ్ వింబుల్డన్‌లో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నాడు. తన కెరీర్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ వింబుల్డన్‌తో పూర్వ వైభవాన్ని అందుకోవాలని... సొంతగడ్డపై మరోసారి సత్తా చాటుకోవాలని ఆండీ ముర్రే పట్టుదలగా ఉన్నారు. అయితే ఈ నలుగురిని కాదని ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) వింబుల్డన్‌లోనూ సంచలనం సృష్టిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ వింబుల్డన్‌లో వావ్రింకా రికార్డు అంత గొప్పగా లేదు. 30 ఏళ్ల ఈ స్విస్ స్టార్ గతంలో ఏనాడూ ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేదు. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన వావ్రింకా అదే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన అతను వింబుల్డన్‌లో ఏదశ వరకు దూసుకెళ్తాడో వేచి చూడాలి. ఈ ఐదుగురు కాకుండా నిషికోరి (జపాన్), బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), రావ్‌నిక్ (కెనడా), సోంగా (ఫ్రాన్స్)లు కూడా సంచలనం సృష్టించే అవకాశముంది.
 
 నేటి ముఖ్య మ్యాచ్‌లు (తొలి రౌండ్)
 పురుషుల సింగిల్స్
 జొకోవిచ్ (1)  కోల్‌ష్రైబర్
 వావ్రింకా (4)  జోవో సౌసా
 నిషికోరి (5)  సిమోన్ బొలెలీ
 రావ్‌నిక్ (7)  డానియల్ ట్రావెర్
 
 మహిళల సింగిల్స్
 సెరెనా (1)  మార్గరీటా
 షరపోవా (4)  జోనా కోంటా
 సఫరోవా (6) అలీసన్ రిస్కీ
 ఇవనోవిచ్ (7)  యి ఫాన్ జు
 
 ఈ ఏడాది వింబుల్డన్ పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 18 లక్షల 80 వేల పౌండ్ల (రూ. 18 కోట్ల 79 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది.
 
 రెండు వారాలపాటు జరిగే ఈ టోర్నీలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 662 మ్యాచ్‌లు జరుగుతాయి.
 
 వింబుల్డన్ ఆవరణలో మొత్తం 41 గ్రాస్‌కోర్టులు ఉన్నాయి. మ్యాచ్‌లకు 19 కోర్టులు వాడతారు. మిగతా 22 కోర్టులను ప్రాక్టీస్ కోసం వినియోగిస్తారు.
 
 ఫైనల్ మ్యాచ్‌లు జరిగే వేదిక సెంటర్ కోర్టులో ప్రేక్షకుల సామర్థ్యం 15 వేలు
 
 టోర్నీ సమయంలో క్రీడాకారుల కోసం 15 వేల అరటి పండ్లను అందుబాటులో ఉంచుతారు.
 
 టోర్నీ సందర్భంగా మొత్తం 54,250 కొత్త టెన్నిస్ బంతులను వినియోగిస్తారు.
 
 టోర్నీ కోసం 250 మంది బాల్ బాయ్స్‌ను ఎంపిక చేస్తారు.
 
 ప్రేక్షకుల కోసం దాదాపు లక్షన్నర స్ట్రాబెర్రీలను అందుబాటులో ఉంచుతారు.
 

మరిన్ని వార్తలు