ఆ ఇన్నింగ్స్‌ వెలకట్టలేనిది: బుమ్రా

28 Jun, 2019 15:56 IST|Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌పై  భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని 61 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఎలా చూసినా ఇది మంచి స్కోరే. ధోని కడవరకూ క్రీజ్‌లో ఉండటం వల్లే భారత్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించిందనేది కాదనలేని వాస్తవం.  అయినా సరే ధోని ఆటతీరుపై మళ్లీ విమర్శలు వినిపిస్తున్నాయి. చివరి ఓవర్‌ మెరుపులను మినహాయిస్తే వన్డే క్రికెట్‌కు ఎంతో అవసరమైన ‘స్ట్రయిక్‌ రొటేటింగ్‌’ విషయంలో ధోని బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని పలువురు తప్పుబడుతున్నారు.( ఇక్కడ చదవండి: విజయ్‌ శంకర్‌.. రాయుడు చూస్తున్నాడు!)

ఈ తరుణంలో భారత ఆటగాళ్లు ధోనికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే ధోని ఆటను కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కొనియాడగా, జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా ధోని ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు. అసలు ధోని ఆడిన ఇన్నింగ్స్‌ వెలకట్టలేనిది అంటూ కొనియాడాడు. ‘ ధోని ఆడిన ఇన్నింగ్స్‌ చాలా విలువైనది. కొన్ని సందర్భాల్లో ధోని స్లోగా ఆడతాడు. అప్పుడు కొన్ని బంతులు వృథా అవ్వడం సహజం. బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. అప్పుడు కుదురుకోవడానికి సమయం పడుతుంది. ఈ తరహా వికెట్‌పై 268 స్కోరు తక్కువేం కాదు. ధోని కడవరకూ క్రీజ్‌లో ఉండటం వల్లే మంచి స్కోరును బోర్డుపై ఉంచకలిగాం’ అని బుమ్రా పేర్కొన్నాడు. భారత జట్టుకు ధోని అనుభవం చాలా అవసరమని, ఒత్తిడిలో ఎలా ఆడాలో ధోని చూసి యువ క్రికెటర్లు నేర్చుకుంటున్నారన్నాడు. విండీస్‌పై ధోని ఇన్నింగ్స్‌ అత్యంత విలువైనది అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.


 

మరిన్ని వార్తలు