రాజకీయాల్లోకి ధోని, గంభీర్‌!

22 Oct, 2018 19:05 IST|Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్‌ క్రికెటర్లు మహేంద్రసింగ్‌ ధోని, గౌతం గంభీర్‌లు రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వీరిద్దరూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గంభీర్‌, ధోనిలతో కమలనాథులు ఓ దఫా చర్చలు కూడా జరిపినట్లు ది సండే గార్డియన్‌ ఓ కథనంలో పేర్కొంది. న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి పనితీరుపై బీజేపీ పార్టీ వర్గాలు, అనుచరులు అసంతృప్తితో ఉన్నారని, ఈ నేపథ్యంలో 2019లో గంభీర్‌ను ఆమె బదులు పోటీ చేయించాలని బీజేపీ కసరత్తు చేస్తోందని ప్రచురించింది. పైగా గంభీర్‌ స్వస్థలం ఢిల్లీ అని, సైన్యం, కాల్పులు, దేశభక్తి అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తాడని, అందుకే గంభీర్‌ను పోటీచేయించాలని భావిస్తున్నట్లు ఓ బీజేపీ సీనియర్‌ నేత పేర్కొన్నట్లు ఆ కథనంలో తెలిపింది. అలాగే జార్ఖండ్‌ నుంచి ధోనిని పోటీ చేయించాలని, ఇది కుదరకపోతే దేశవ్యాప్తంగా అభిమాన గణం కలిగిన ఈ ఇద్దరూ ఆటగాళ్లను స్టార్‌ క్యాంపైనర్‌లుగా నియమించుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు పేర్కొంది.

అంతర్జాతీయ క్రికెట్‌ వీడ్కోలు చెప్పని ఈ ఇద్దరు ఆటగాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నారంటే క్రికెట్‌ అభిమానులు మాత్రం నమ్మడం లేదు. 2019 ఎన్నికల సమయంలో ధోని ప్రపంచకప్‌ ఆడుతాడని, అతను ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచకప్‌ వదులుకోడని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా విషయాల్లో రాజకీయనాయకులను బహిరంగంగా విమర్శించే గంభీర్‌ కూడా రాజకీయాల్లో చేరే ప్రసక్తే లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం గంభీర్‌ ఢిల్లీ తరుపున దేశవాళి క్రికెట్‌ ఆడుతుండగా.. ధోని వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో బిజీగా ఉ‍న్నాడు.
 

మరిన్ని వార్తలు