ధోని దాదాగిరి

13 Apr, 2019 03:12 IST|Sakshi

తప్పుడు సంప్రదాయానికి తెర తీసిన కెప్టెన్‌ హాట్‌

అంపైర్లపై అనుచిత ఆగ్రహం

మాజీ సారథిపై తీవ్ర విమర్శలు

క్రికెట్‌లో అంపైరింగ్‌ పొరపాట్లు మొదటి సారేమీ కాదు... అంపైర్లు చేసిన తప్పుల వల్లే మ్యాచ్‌ ఫలితాలు తారుమారైన ఘటనలు కోకొల్లలు... అంపైర్ల నిర్ణయాలు కొన్ని సార్లు తమకు అనుకూలంగా, మరికొన్ని ప్రత్యర్థి జట్ల పక్షాన రావడం దేశవాళీనుంచి అంతర్జాతీయ క్రికెట్‌ వరకు ప్రతీ జట్టుకు అనుభవమే. సాధారణంగానైతే ఆటగాళ్లు లేదా కెప్టెన్లు ‘తప్పులు మానవ సహజం’ అని లేదంటే ‘ఇదంతా ఆటలో భాగమే’ అని దానిని వదిలేస్తుంటారు.

కాస్త ఆవేశపరులైతే తమ అసహనాన్ని, కోపాన్ని బయటకు ప్రదర్శిస్తారు. అంతే తప్ప ఔటై బౌండరీ బయట కూర్చున్న వ్యక్తి లోపలికి దూసుకుపోయి అంపైర్లతో గొడవ పెట్టుకోడు. కానీ దిగ్గజ క్రికెటర్, రెండు వరల్డ్‌ కప్‌లలో జట్టును విజేతగా నిలిపిన వ్యక్తి ఆ పని చేశాడు. కేవలం ఒక నోబాల్‌ కోసం క్రికెట్‌ ప్రపంచమంతా ఆశ్చర్యపోయే రీతిలో అతను ప్రవర్తించాడు.   

సాక్షి క్రీడా విభాగం
సరిగ్గా రెండు వారాల క్రితం మలింగ వేసిన నోబాల్‌ను గుర్తించలేకపోయినందుకు ‘అంపైర్లు కళ్లు తెరచి పని చేయాలి. మేం ఆడుతోంది ఐపీఎల్‌. క్లబ్‌ క్రికెట్‌ కాదు’... అని విరాట్‌ కోహ్లి అంపైర్లపై విరుచుకు పడ్డాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు అంపైర్లపై బహిరంగ వ్యాఖ్యలు చేయరాదు. కానీ కోహ్లికి ఐపీఎల్‌ నిర్వాహకులు కనీసం హెచ్చరిక కూడా జారీ చేయలేదు. ఇప్పుడు తాను రెండాకులు ఎక్కువే చదివానన్నట్లుగా ధోని అంపైర్లపై చెలరేగిపోయాడు. ఘటన జరిగిన తీరును చూస్తే కెప్టెన్‌గా అతను అసంతృప్తి చెందడం సహజమే అయినా దానిని వ్యక్తీకరించే విషయంలో ధోని గీత దాటాడనేది వాస్తవం.  

కోచ్‌ సమర్థన! 
నిబంధనల ప్రకారం అయితే ‘హైట్‌ నోబాల్‌’ను ఖరారు చేయాల్సింది లెగ్‌ అంపైర్‌ మాత్రమే. కానీ నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న అంపైర్‌ ఉల్హాస్‌ గంధే నోబాల్‌గా ప్రకటించాడు. విదర్భ తరఫున దాదాపు పదేళ్లు రంజీ ట్రోఫీ క్రికెట్‌ ఆడిన 44 ఏళ్ల ఉల్హాస్‌ దేశవాళీ అంపైర్‌ మాత్రమే. పెద్ద అనుభవం లేని అతను నోబాల్‌ ఇవ్వడంలో అత్యుత్సాహం ప్రదర్శించిన మాట వాస్తవం. కానీ సాంట్నర్‌ షాట్‌ ఆడేందుకు ముందుకు రావడం, ఆడేటప్పుడు గాల్లోకి ఎగరడం వల్ల లెగ్‌ అంపైర్‌ ఆక్సెన్‌ఫోర్డ్‌ దీనిని నోబాల్‌గా గుర్తించలేదు. దాంతో ఉల్హాస్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దాంతో ధోని మైదానంలోకి దూసుకుపోయి వాదనకు దిగాడు.

అది నోబాల్‌ కాదంటూ చెప్పి ధోనిని సముదాయించి బయటకు పంపేందుకు ఆక్సెన్‌ఫోర్డ్‌కు తల ప్రాణం తోకకు వచ్చింది. మ్యాచ్‌ అనంతరం ధోని అయితే దీనిపై ఏం మాట్లాడలేదు కానీ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ పేలవ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘నోబాల్‌పై నిర్ణయం తీసుకునే విషయంలో అంపైర్లు వ్యవహరించిన తీరుపై ధోనికి కోపం వచ్చింది. ఎందుకు వెనక్కి తీసుకున్నారనేది అతనికి అర్థం కాలేదు. దాంతో మరింత స్పష్టత కోరేందుకే అతను మైదానంలోకి వెళ్లాడు. నిజానికి అతను చాలా సంయమనంతో ఉంటాడు. ఇది అసాధారణం. ఈ ఘటన గురించి రాబోయే రోజుల్లో అతడిని మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తారని నాకు తెలుసు’ అని ఫ్లెమింగ్‌ అన్నాడు.  

లెక్కలేనితనమా... 
ధోని వీరాభిమానులు కూడా అతను చేసిన పనిని నమ్మలేకపోతున్నారు. నిజంగా నోబాల్‌పై అసంతృప్తి ఉంటే అన్ని తెలిసిన అతను నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సింది. అదేమీ జట్టు కోసం నిలబడాల్సినంత పెద్ద ఘటన కాదు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత రిఫరీకి ఫిర్యాదు చేసే అవకాశం అతనికి ఉంది. లేదా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తరఫున ఘాటైన నివేదిక తయారు చేసి ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌కు అందజేస్తే వారే అంపైర్‌పై చర్య తీసుకుంటారు. కానీ అంపైర్ల అధికారాన్ని సవాల్‌ చేస్తూ వారిని బహిరంగంగా అవమానించాడు. ఒక రకంగా చూస్తే చొక్కా చేతులను పైకి మడిచి గొడవకు దిగే వ్యక్తుల తరహాలో ప్రవర్తించాడు.

భారత క్రికెట్‌లో తన బలమేమిటో చూపించాడు. ఆటకంటే గొప్ప వ్యక్తి అన్నట్లుగా బీసీసీఐ ధోనిని చూస్తుంది కాబట్టి అతను అలా చేయగలిగాడు. ఇకపై ప్రతీ క్రికెటర్‌ ఔటై బయట కూర్చొని కూడా అంపైరింగ్‌ నిర్ణయం తప్పని అనిపిస్తే అప్పటికప్పుడు ప్రశ్నించేందుకు సిద్ధమైపోతాడు. ఇటీవలి చెన్నై టీమ్‌ డాక్యుమెంటరీ ‘రోర్‌ ఆఫ్‌ ద లయన్‌’ తరహాలో కొన్నేళ్లకు మళ్లీ ఏమైనా ప్రత్యేక వీడియోను ధోని స్వయంగా నిర్మించి అందులో ఈ ఘటనపై తన ‘వివరణ’ ఇస్తే తప్ప ధోని స్పందన ఇప్పట్లో ఉండదు. కానీ తన ప్రవర్తనతో అతను కొంత మంది అభిమానులకైనా దూరమయ్యాడనేది వాస్తవం.  

జరిమానాతో సరి... 
ఒక వైపు ధోని చేసిన పనిపై అన్ని వైపులనుంచి విమర్శలు వస్తూ కనీసం మ్యాచ్‌ నిషేధమైనా ఉండాలని వినిపిస్తుండగా ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మాత్రం అతి స్వల్ప శిక్షతో సరిపెట్టింది. లెవల్‌ 2 తప్పిదం కింద గుర్తిస్తూ అతని మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. నిజానికి ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌కు ధోని ఫీజు ఎంతనేదే స్పష్టత లేదు. ఎంత మొత్తమైనా ఎలాగూ ఫ్రాంచైజీనే చెల్లిస్తుంది కాబట్టి ధోనికి శిక్ష పడనట్లే! 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు