కోహ్లి కంటే ముందు..మోదీ తర్వాత

26 Sep, 2019 10:37 IST|Sakshi

న్యూఢిల్లీ:  భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి ఉన్న క్రేజ్‌ మరోసారి బహిర్గతమైంది. భారత దేశంలో ధోనికున్న అభిమానగణం ఇప్పటికీ పదిలంగానే ఉంది. బ్రిటన్‌కు చెందిన మార్కెటింగ్‌ పరిశోధన సంస్థ యుగోవ్‌ నిర్వహించిన సర్వేలో ధోని రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులకు భారత్‌లో ఎంత అభిమానం ఉందనే విషయంపై నిర్వహించిన సర్వేలో ధోని 8.58 శాతాన్ని సంపాదించాడు. అయితే ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత స్థానం ధోనిదే కావడం ఇక్కడ మరో విశేషం. నరేంద్ర మోదీ 15.66 శాతంతో టాప్‌లో ఉన్నారు.

కాగా, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 4.46 శాతాన్ని మాత్రమే సాధించారు. రతన్‌ టాటా 8.02 శాతం, బరాక్‌ ఒబామా 7.36 శాతాన్ని కల్గి ఉన్నారు. అయితే పోర్చుగీసు ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోకు భారత్‌లో 2.95 శాతంలో అభిమానులు ఉండటం విశేషం. ఇటీవల ఫిఫా అత్యుత్తమ  పురుషుల అవార్డును దక్కించుకున్న అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ కూడా 2.32 శాతం సాధించాడు.  41 దేశాల్లోని 42 వేలమందిని ఆ సంస్థ సర్వేలో భాగస్వాములను చేసింది. పురుషులు, మహిళల విభాగాల్లో వేర్వేరుగా సర్వే చేసింది.  భారత మహిళల్లో దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ (10.36) టాప్‌లో నిలిచింది. క్రీడాకారుల జాబితాలో ధోని తర్వాత సచిన్‌ (5.81) నిలిచాడు.

మరిన్ని వార్తలు