ధోని మళ్లీ కెప్టెన్‌గా... 

26 Sep, 2018 01:50 IST|Sakshi

 200వ వన్డేకు నాయకత్వం  వహించిన ‘మిస్టర్‌ కూల్‌’  

దుబాయ్‌: దాదాపు రెండేళ్ల క్రితం విశాఖపట్నంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో మహేంద్ర సింగ్‌ ధోని ఆఖరిసారిగా భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌ కెప్టెన్‌గా అతనికి 199వది. ఆ తర్వాత అతను కెప్టెన్సీ నుంచి తప్పుకొని కోహ్లి నేతృత్వంలో, అనంతరం రోహిత్‌ శర్మ నాయకత్వంలో కూడా కలిపి మరో 42 మ్యాచ్‌లు ఆడాడు. కానీ మంగళవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను అనూహ్యంగా కెప్టెన్‌గా బరిలోకి దిగాల్సి వచ్చింది. రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌ నుంచి విశ్రాంతి తీసుకోవడంతో మళ్లీ ‘మిస్టర్‌ కూల్‌’ బాధ్యతలు చేపట్టాడు. తన ప్రమేయం లేకుండానే అతను 200 వన్డేలకు నాయకత్వం వహించిన కెప్టెన్‌గా అరుదైన మైలురాయిని చేరుకోవడం విశేషం. పాంటింగ్‌ (ఆస్ట్రేలియా–230), ఫ్లెమింగ్‌ (న్యూజిలాండ్‌–218) మాత్రమే ఈ ఘనత సాధించారు. ‘కెప్టెన్‌గా నాడు 199 మ్యాచ్‌ల వద్ద ఆగిపోయాను. ఇప్పుడు దానిని 200 చేసేందుకు ఈ మ్యాచ్‌ అవకాశం ఇచ్చింది. ఏదైనా మనకు రాసి పెట్టి ఉండాలని నేను నమ్ముతాను. ఒకసారి కెప్టెన్సీ వదిలేశాక నా చేతుల్లో ఏమీ లేకపోయింది. మళ్లీ కెప్టెన్‌ అవుతానని అనుకోలేదు. 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకోవడం సంతోషమే కానీ నా దృష్టిలో ఇలాంటి వాటికి పెద్దగా విలువ లేదు’ అని టాస్‌ అనంతరం ధోని వ్యాఖ్యానించాడు.  

దీపక్‌ చహర్‌@ 223 
ఆసియా కప్‌లో మరో భారత పేసర్‌ అరంగేట్రం చేశాడు. రాజస్తాన్‌కు చెందిన దీపక్‌ చహర్‌కు తొలిసారి వన్డే ఆడే అవకాశం లభించింది. ఇటీవలే ఇంగ్లండ్‌పై టి20ల్లో అరంగేట్రం చేసిన అతను వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 223వ ఆటగాడు. గత ఏడాది ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు (19) పడగొట్టడంతో పాటు 2018 ఐపీఎల్‌లో చెన్నై తరఫున రాణించి చహర్‌ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2010లో ఆడిన తొలి రంజీ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన (8/10)తో హైదరాబాద్‌ను 21కే ఆలౌట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.   

ఐదు మార్పులతో: ప్రాధాన్యత లేని మ్యాచ్‌ కావడంతో భారత్‌ ఏకంగా ఐదు మార్పులతో బరిలోకి దిగింది. రోహిత్, ధావన్, భువనేశ్వర్, బుమ్రా, చహల్‌ స్థానాల్లో రాహుల్, మనీశ్‌ పాండే, సిద్ధార్థ్‌ కౌల్, ఖలీల్‌ , దీపక్‌ జట్టులోకి వచ్చారు.   

మరిన్ని వార్తలు