ఈడెన్ లో ధోని 'టెస్టు'!

10 Nov, 2017 14:34 IST|Sakshi

కోల్ కతా:టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని టెస్టు మ్యాచ్ లకు వీడ్కోలు చెప్పి దాదాపు రెండేళ్లు అయ్యింది. 2014లో టెస్టులకు గుడ్ బై చెప్పిన ధోని.. 90 మ్యాచ్ ల్లో 4,876 పరుగులు చేశాడు. అయితే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినా క్రికెట్ పై ధోనికి ఉన్న ఆసక్తి ఎక్కువ అనడానికి తాజా ఘటనే ఉదాహరణ. నవంబర్ 16వ తేదీ నుంచి భారత్-శ్రీలంక జట్ల మధ్య ఈడెన్ లో టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కు ధోనికి ఎటువంటి సంబంధం లేదు. కాగా,  ఈడెన్ పిచ్ ను ధోని పరిశీలించడం విశేషం. పిచ్ గురించి క్యూరేటర్ సుజాన్ ముఖర్జీని అడిగి తెలుసుకున్న ధోని..ఆపై పిచ్ ను పరిశీలించాడు.


దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్, మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఒక వ్యాపార ప్రకటన కోసం జత కట్టారు. దీనిలో భాగంగా 58 ఏళ్ల కపిల్‌ తనదైన శైలిలో బౌలింగ్‌ చేయగా... 36 ఏళ్ల ధోని తన బ్యాటింగ్‌ ప్రత్యేకతను ప్రదర్శిస్తూ ఈడెన్ గార్డెన్ లో షూటింగ్ లో పాల్గొన్నాడు. దీనికి క్యాబ్(క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అనుమతి ఇవ్వడంతో ఇక్కడ షూటింగ్ జరిగింది. షూటింగ్ విరామ సమయంలో ధోని పిచ్ వద్దకు వెళ్లాడు. ఆ క్రమంలోనే క్యూరేటర్ ముఖర్జీతో మాట్లాడిన ధోని.. పిచ్ ను ఎలా రూపొందించారు అనే దాన్ని క్షణ్ణంగా పరిశీలించాడు. దీనిపై క్యూరేటర్ ముఖర్జీ మాట్లాడుతూ.. పిచ్ ను రూపొందించిన విధానంపై ధోని నుంచి అభినందనలు అందుకున్నట్లు  తెలిపాడు.పిచ్ చాలా  బాగుందంటూ ధోని కితాబిచ్చాడని ముఖర్జీ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు