‘రిటైర్‌ అవ్వను.. అందుబాటులో ఉండను’

22 Jul, 2019 16:59 IST|Sakshi
ఎంఎస్‌ ధోని

న్యూఢిల్లీ : ఓవైపు రిటైర్మెంట్‌పై ఎడతెగని చర్చ నడుస్తుండగా... మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మాత్రం ప్రస్తుతానికి ఆ ఆలోచనే లేదని భారత చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో తాను భాగం కానని, మేనేజ్‌మెంట్‌ వ్యూహాలకు అనుగుణంగా యువ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవచ్చని తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. 

ప్రపంచకప్‌ ఓటమి అనంతరం ధోని రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడనే ప్రచారం జోరందుకుంది. కానీ ధోని మాత్రం రాబోయే రెండు నెలలు ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్‌ ఆర్మీ)లో పని చేయాలని భావించి, విండీస్‌ పర్యటనకు దూరంగా ఉంటానని చెప్పాడని ఆదివారం వెస్టిండీస్‌ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్ల ప్రకటన సందర్భంగా ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపాడు. ధోని కోరిక మేరకే విండీస్‌ పర్యటన నుంచి తప్పించి యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌కు అవకాశం ఇచ్చినట్లు స్పష్టం చేశాడు. అయితే ఈ సందర్భంగా ధోని తన రిటైర్మెంట్‌పై కూడా క్లారిటీనిచ్చినట్లు తెలుస్తోంది. 

‘ ప్రస్తుతానికి రిటైర్మెంట్‌పై ఎలాంటి ఆలోచనలేదని ధోని ఎమ్మెస్కే ప్రసాద్‌కు తెలిపాడు. అంతే కాకుండా భారత్‌ భవిష్యత్తు ప్రణాళికల్లో ఉండనని చెప్పాడు. యువ ఆటగాళ్లను సిద్దం చేసుకోమని, జట్టు ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగాలని కూడా స్పష్టం చేశాడు. అందుకే ఎమ్మెస్కే.. రిటైర్మెంట్‌ ధోని వ్యక్తిగతం, మేము మాత్రం మా ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగుతాం’ అని మీడియాకు తెలిపాడని ఓ జాతీయ చానెల్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు