అందుకే ధోని ‘కెప్టెన్‌ కూల్‌’.. వైరల్‌!

27 May, 2018 14:04 IST|Sakshi
చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని (ఫైల్‌ ఫొటో)

విమర్శలపై ‘కూల్‌’గా స్పందించిన ఎంఎస్‌ ధోని

ముంబై : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌)-11లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఇటీవల సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో చెన్నై 2 వికెట్ల తేడాతో విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించినా విన్నింగ్‌ టీమ్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ధోని చాలా తెలివిగానే కాదు చాకచక్యంగా వివరణ ఇచ్చి విమర్శల నోళ్లు మూయించాడనంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌కు ధోని బంతినివ్వలేదు. సీనియర్‌ బౌలర్‌కు బంతినివ్వకపోవడం సరైన నిర్ణయం కాదని, ఎందుకు భజ్జీకి బంతిని ఇవ్వలేదని ధోనిపై విమర్శలు వచ్చాయి. 

దీనిపై ధోని మీడియాతో మాట్లాడుతూ.. ‘నా ఇంట్లో చాలా కార్లు, బైకులున్నాయి. అయితే ఒకేసారి వాటిని ఏ విధంగా నేను నడపగలను. అవసరాన్ని బట్టి ఏ వాహనం వాడాలో ఎక్కడ, ఎప్పుడు ఉపయోగించాలో తెలియాలి. అదేవిధంగా జట్టులో ఆరేడుగురు బౌలర్లు ఉన్నప్పటికీ.. పరిస్థితికి తగ్గట్లుగా బౌలర్‌కి బంతినివ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో హర్భజన్‌కు బంతనివ్వడం సరైనది కాదని భావించాను. వాస్తవానికి ఏ ఫార్మాట్‌ను పరిగణనలోకి తీసుకున్నా భజ్జీ సీనియర్‌, అనుభవజ్ఞుడని అందరికీ తెలిసిందేనని’ ధోని వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. అందుకే ధోని గ్రేట్‌ కెప్టెన్‌ అయ్యాడంటూ ‘మిస్టర్‌ కూల్‌’ క్రికెటర్‌ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.

ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించి ఫైనల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆపై క్వాలిఫయర్‌-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించిన సన్‌రైజర్స్‌ ఫైనల్లో చెన్నైతో అమీతుమీ తేల్చుకోనుంది. ఆదివారం (నేటి) రాత్రి 7 గంటలకు ముంబైలోని వాంఖెడే మైదానం వేదికగా చెన్నై, సన్‌రైజర్స్‌ జట్లు తలపడనున్నాయి.

మరిన్ని వార్తలు