ఆసీస్‌ గడ్డపై ధోని అరుదైన ఘనత

18 Jan, 2019 17:53 IST|Sakshi

మెల్‌బోర్న్ : టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆస్ట్రేలియా గడ్డపై అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ధోని (87 నాటౌట్‌ : 114 బంతులు, 6ఫోర్లు) హాఫ్‌ సెంచరీ సాధించి భారత విజయంలో కీలక పాత్రపోషించిన విషయం తెలిసిందే. అదే సమయంలో అంతర్జాతీయ వన్డేల్లో ఆసీస్ గడ్డపై వెయ్యి పరుగులు పూర్తిచేసుకున్న నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా ధోని గుర్తింపు పొందాడు. 34 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ధోని ఈ ఫీట్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఘనతను అందుకున్న సచిన్‌ టెండూల్కర్‌, విరాట్ కోహ్లి, రోహిత్‌ శర్మల సరసన చేరాడు.

శిఖర్‌ ధావన్‌ వికెట్‌ అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనికి తొలి బంతికే వెనుదిరిగాల్సి ఉన్నా.. అదృష్టం కలిసొచ్చింది. ధోని ఇచ్చిన సునాయస క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్‌ జారవిడిచాడు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ధోని.. ప్రశాంతంగా ఓ లెక్కప్రకారం ఆడుతూ భారత్‌కు విజయాన్నందించాడు. అయితే ధోనికి మరోక లైఫ్ కూడా లభించింది. సిడిల్‌ వేసిన 39 ఓవర్‌ నాలుగో బంతి ధోని బ్యాట్‌కు ఎడ్జై కీపర్‌ అలెక్స్‌ క్యారీ చేతిలో పడింది కానీ ఆసీస్‌ ఫీల్డర్లు పెద్దగా అప్పీల్‌ చేయకపోవడంతో ధోని బతికిపోయాడు. మ్యాక్స్‌వెల్‌ ఒక్కడూ అప్పీల్‌ చేసినా.. అంపైర్‌ పట్టించుకోలేదు. అయితే టీవీ రిప్లేలో మాత్రం బంతి బ్యాట్‌కు తగిలినట్లు కనిపించింది. ఏది ఏమైనప్పటికి ఈ సిరీస్‌తో ధోని గాడినపడ్డాడు. కీలక సందర్భాల్లో రాణించి భారత్‌ సిరీస్‌ నెగ్గడంలో కీలక పాత్ర పోషించడంతో ధోనికి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ వరించింది. ఇక 2011 అనంతరం ధోని ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌గా నిలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సిరీస్‌ ముందు నిలకడలేమి ఆటతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ మాజీ కెప్టెన్‌.. ఈ సిరీస్‌లో రాణించడం, ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌గా నిలవడంతో అతని అభిమానులు పట్టరాని సంతోషంలో మునిగితేలుతున్నారు.

మరిన్ని వార్తలు