అందుకే రిటైర్మెంట్‌పై ధోని వెనకడుగు!

23 Jul, 2019 16:07 IST|Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోని రిటైర్మెంట్‌ విషయంలో రోజుకో వార్త హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతానికి రిటైర్మెంట్‌ ఆలోచన లేదని, భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లోకూడా తాను భాగం కానని, మేనేజ్‌మెంట్‌ వ్యూహాలకు అనుగుణంగా యువ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవచ్చని ఎమ్మెస్కే ప్రసాద్‌కు ధోని స్పష్టం చేసినట్లు సోమవారం వార్తలు షికారు చేశాయి. అయితే రిటైర్మెంట్‌ విషయంలో ధోని వెనుకడుగు వేయడానికి కారణం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లినేనని తాజా సమాచారాన్ని బట్టి తెలస్తోంది. వాస్తవానికి ప్రపంచకప్‌ అనంతరమే ధోని ఆటకు గుడ్‌బై చెప్పాలని భావించాడని, కానీ కోహ్లి విన్నపం మేరకు ఆగాడని భారత కెప్టెన్‌ సన్నిహితుడు ఒకరు మీడియాకు తెలిపారు.

‘ఇంత అత్యవసరంగా రిటైర్మెంట్‌ తీసుకోవద్దనే కోహ్లి విన్నపంతోని ధోని తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ధోనికి ఎలాంటి ఫిట్‌నెస్‌ సమస్యల్లేవని, అతను 2020 టీ20 ప్రపంచకప్‌ వరకు కొనసాగగలడని కోహ్లి భావిస్తున్నాడు. అతని సేవలు అవసరమైనప్పుడు జట్టుకు ఉపయోగపడుతాడనే యోచనలో ఉన్నాడు. ఈ సమయంలో వికెట్‌ కీపర్‌గా రిషభ్‌ పంత్‌ను సిద్ధం చేయాలనుకుంటున్నారు. పంత్‌ గాయపడ్డా.. ఫామ్‌ కోల్పోయినా.. ప్రత్యామ్నయంగా ధోని ఉపయోగపడుతాడని, అలాంటప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగదు.’ అని కోహ్లి భావిస్తున్నట్లు అతని సన్నిహితుడు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే ధోని భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో భాగం కానని ఎమ్మెస్కే ప్రసాద్‌కు చెప్పాడన్నారు. రాబోయే రెండు నెలలు ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్‌ ఆర్మీ)లో పని చేయాలని భావించిన ధోని.. విండీస్‌ పర్యటనకు దూరంగా ఉంటానని చెప్పిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు