సచిన్‌పై ధోని ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌

25 Jun, 2019 14:03 IST|Sakshi

ప్రపంచకప్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పసికూన ఆఫ్గానిస్తాన్‌ టీమిండియాకు చుక్కలు చూపిన సంగతి తెలిసిందే. ఛేదనలో బలమైన బౌలింగ్‌ను తట్టుకుంటూ కోహ్లి సేనకు ఈ మెగాటోర్నీలో తొలి ఓటమి రుచి చూపించేలా కనిపించింది. అయితే బౌలర్లు బుమ్రా, షమీ పేస్‌తో వారిని పడగొట్టడంతో 11 పరుగుల తేడాతో విజయం సాధించి టీమిండియా పరువు నిలబెట్టుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో మిస్టర్‌ కూల్‌ ధోని బ్యాటింగ్‌ గొప్పగా లేదని, సీనియర్‌ ప్లేయర్‌ అయి ఉండి చాలా బంతులు వృథా చేశాడంటూ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ విమర్శించాడు.

మ్యాచ్‌ విశ్లేషణలో భాగంగా సచిన్‌ మాట్లాడుతూ..‘ ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన నన్ను నిరాశపరిచింది. ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. ధోని, కేదార్‌ జాదవ్‌ల భాగస్వామ్యం పట్ల కూడా నేను సంతోషంగా లేను. వారిద్దరు చాలా నెమ్మదిగా ఆడారు. 34 ఓవర్లకు కేవలం 119 పరుగులే చేశాం. అప్పటి నుంచే మనం వెనుకబడ్డాం. సీనియర్‌ ఆటగాడు అయి ఉండి ధోని కూడా పాజిటివ్‌గా కనిపించలేదు’ అని ఓ జాతీయ మీడియాతో పేర్కొన్నాడు. ఈ క్రమంలో ధోని ఫ్యాన్స్‌ సచిన్‌ను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ‘ సచిన్‌ కంటే ధోనీనే ఎన్నో రెట్లు గొప్ప ఆటగాడు. 90వ దశకంలో జట్టులో స్థానం కోసం పోరాడాల్సి వచ్చిన వ్యక్తి తాను మాత్రమే బిగ్‌ హిట్టర్‌నని భావిస్తున్నాడు. ఎన్నో ప్రపంచకప్‌లు ఆడినా ధోనీ వచ్చేదాకా ఒక్కటీ గెలవలేదు. మేటి ఆటగాళ్లంతా ఉన్నా సచిన్‌కు సాధ్యం కానిది ధోని అతడికి కానుకగా ఇచ్చాడు’ అంటూ సచిన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే విధంగా ఇద్దరి బయోపిక్‌లకు పోలుస్తూ.. ప్రేక్షకులతో నిండిన, ఖాళీగా ఉన్న స్టేడియం ఫొటోలను షేర్‌ చేస్తున్నారు.

కాగా సౌతాంప్టన్‌లో ఆఫ్గాన్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో ధోని 52 బంతులు ఆడి కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. అదే విధంగా జాదవ్‌, ధోని ద్వయాన్ని ప్రత్యర్థి స్పిన్నర్లు కట్టిపడేశారు. ఒకానొక సమయంలో 6 ఓవర్లపైగా వీరు ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయారు. మూడో బ్యాట్‌ మార్చాక ధోని ఓ ఫోర్‌ సాధించగలిగాడు. ఓవర్లు తరిగిపోతుండటంతో స్కోరు పెంచే ఉద్దేశంతో రషీద్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి ధోని స్టంపౌటయ్యాడు. దీంతో 57 పరుగుల ఐదో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

>
మరిన్ని వార్తలు