పాకిస్తాన్‌లో ధోని ఫీవర్‌!

10 Mar, 2020 15:58 IST|Sakshi

ఇస్లామాబాద్‌: మరికొద్ది రోజుల్లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-13వ సీజన్‌ ఆరంభం కానుంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ అయిన ఎంఎస్‌ ధోని ఆట ఎలా ఉండబోతుందనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ధోని భారత జట్టుకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌లో ధోనికి భారత జట్టులో స్థానం ఉంటుందా.. లేదా అనేది అతని ఐపీఎల్‌ ప్రదర్శనపై ఆధారపడిందనేది కాదనలేని సత్యం. ఈ క్రమంలో ధనాధన్‌ ధోని ఆట గురించి అతని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాగా, ఇప్పుడు పాకిస్తాన్‌లో కూడా ధోని ఫీవర్‌ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన ఆదరణ ఉన్న ధోనికి పాకిస్తాన్‌లో సైతం అభిమానులున్నారు. ఇది తాజాగా మరోసారి నిరూపితమైంది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో ధోని ఫ్యాన్‌ ఒకరు అలరించాడు. (ధోని@ 6, 6, 6, 6 ,6)

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కలర్‌లో ఉన్న జెర్సీపై ధోని పేరుతో పాటు నంబర్‌-7ను వేయించుకుని సందడి చేశాడు. పీఎస్‌ఎల్‌ ఐదో సీజన్‌లో భాగంగా  ఇటీవల ముల్తాన్‌ సుల్తాన్స్‌-ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ల మధ్య మ్యాచ్‌ జరగ్గా  ఒక అభిమాని ఇలా ఆకట్టుకున్నాడు. ఇస్లామాబాద్‌ జట్టు అభిమాని అయిన అతను ధోని పేరుతో జెర్సీని ధరించడం హైలైట్‌గా నిలవగా, ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సీజన్‌ ఐపీఎల్‌ మార్చి 29వ తేదీన ఆరంభం కానుండగా, తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ చాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరుగనుంది. దాంతో ధోని రీఎంట్రీ షురూ కానుంది. 


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు