ధోని అంటే అంతే.. కొడితే బయట పడాలి!

4 Jun, 2019 08:48 IST|Sakshi
ధోని ప్రాక్టీస్‌ (బీసీసీఐ ట్వీట్‌ చేసిన ఫొటో)

ప్రాక్టీస్‌లో అదరగొట్టిన మిస్టర్‌ కూల్‌

వీడియోను ట్వీట్‌ చేసిన బీసీసీఐ

సౌతాంప్టన్‌ : దక్షిణాఫ్రికాతో జరిగే ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌ కోసం టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆటగాళ్ల ప్రాక్టీస్‌ వివరాలను భారత నియంత్రణ క్రికెట్‌ మండలి (బీసీసీఐ) ఎప్పటికప్పుడూ ట్వీట్‌ర్‌ వేదికగా అభిమానులకు తెలియజేస్తుంది. సోమవారం నెట్స్‌లో తీవ్రంగా బ్యాటింగ్‌ సాధన చేసిన సీనియర్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, యువ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ ప్రాక్టీస్‌ వీడియోలను బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ఈ ప్రాక్టీస్‌ సెషన్‌లో ధోని బంతిని ఏకంగా మైదానం బయట ఎత్తేశాడు. ఈ విషయాన్నే పేర్కొంటూ ‘చాలా సులువుగా.. నైస్‌గా ధోని బంతిని మైదానం బయట ఎత్తేశాడు’ అని బీసీసీఐ ధోనికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ‘ధోని అంటే అంతే మరి.. కొడితే బయట పడాలి’ అంటూ అతని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

ఈ ప్రపంచకప్‌లో ధోని చాలా కీలకమని ఇప్పటికే హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అతనిలా కీపింగ్‌ ఎవరూ చేయలేరని, ధోని సలహాలు కెప్టెన్‌ కోహ్లికి ఎంతో అవసరమని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే మూడు ప్రపంచకప్‌లు ఆడిన ఈ మిస్టర్‌ కూల్‌ నాలుగో సమరానికి సిద్దమయ్యాడు. 341 అంతర్జాతీయ వన్డేలు ఆడిన ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ 10,500 పరుగులు సాధించాడు. ఆ మధ్య నిలకడలేమి ఆటతో తీవ్ర విమర్శలు ఎదుర్కొని మెగా టోర్నీ ముందు గాడిన పడ్డాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో సూపర్‌ ఫినిషింగ్‌లతో అదరగొట్టాడు. 

మరిన్ని వార్తలు