'ధోనిలో నచ్చింది అదే'

14 Aug, 2017 11:44 IST|Sakshi
'ధోనిలో నచ్చింది అదే'

న్యూఢిల్లీ:భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ స్కాట్ స్టైరిస్‌ ప్రశంసలు కురిపించాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్పీఎల్) భాగంగా వ్యాఖ్యాతగా వ్యహరించేందుకు భారత్ కు విచ్చేసిన స్టైరిస్.. ప్రత్యేకంగా ధోనిని కొనియాడాడు. జట్టులో ప్రతీ ఒక్కరి అభిప్రాయాన్ని వినే కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది ధోనినే అని స్టైరిస్ పేర్కొన్నాడు.

 

సాధారణంగా ప్రతీ ఒక్కరీ అభిప్రాయాన్ని వినే కెప్టెన్లు చాలా తక్కువగా ఉంటారని, ధోని మాత్రం అలా కాకుండా ఎవరు ఏమి చెప్పినా ఓపిగ్గా వింటాడన్నాడు. ఆ గ్రూప్  లో అతను చిన్నవాడా, పెద్దవాడా అనే విషయాన్ని ధోని అస్సలు పట్టించుకోకుండా చెప్పే విషయాన్ని మాత్రమే  పరిగణలోకి తీసుకుంటాడన్నాడు. అదే ధోనిలో తనకు నచ్చిన లక్షణమని స్టైరిస్ స్పష్టం చేశాడు. ఇక్కడ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ప్లెమింగ్ ను ఉదాహరించాడు. 'ఫ్లెమింగ్, ధోనిలు ఇద్దరూ వేర్వేరుగా ఆలోచిస్తారు.

 

ఫ్లెమింగ్ కేవలం ఇది చేయాలని ఆదేశిస్తాడు. ఫలానాది నీవు  చేయాలని మాత్రమే ఫ్లెమింగ్ చెబుతాడు. ధోని అలా కాకుండా ఎవరు ఏమి చెప్పినా వింటాడు. నీవు కేవలం ఐదు గేమ్ లు మాత్రమే ఆడిన 19 ఏళ్ల ఆటగాడివైనా నీ మాట ధోని వింటాడు'అని స్టైరిస్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఐపీఎల్లో ధోనితో కలిసి పంచుకున్న గత జ్ఞాపకాల్ని స్టైరిస్ గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ లు ఆడేటప్పుడు ప్రతీరోజూ అతని గది తలుపులు ఉదయం మూడు గంటల నుంచే ఓపెన్ చేసి ఉండేవన్నాడు. అందుచేత ధోనిని 3ఎ.ఎమ్  కెప్టెన్ గా అభివర్ణించాడు స్టైరిస్.

మరిన్ని వార్తలు