ధోనికి కోపమొచ్చింది!

7 Apr, 2019 16:47 IST|Sakshi

చెన్నై : మిస్టర్‌ కూల్ మహేంద్రసింగ్‌ ధోనికి కోపమొచ్చింది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో శనివారం చేపాక్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ చెన్నై కెప్టెన్‌ యువ బౌలర్‌ దీపక్‌ చాహర్‌పై గుస్సా అయ్యాడు. ధోని ఆగ్రహాన్ని చూసిన దీపక్‌ అతనితో భయంగానే మాట్లాడాడు. పంజాబ్‌ విజయానికి 12 బంతుల్లో 39 పరుగుల కావాల్సిన పరిస్థితుల్లో బంతిని అందుకున్న చహర్‌ వరుసగా రెండు నోబాల్స్‌ వేసాడు. తద్వారా పంజాబ్‌కు రెండు ఫ్రీ హిట్స్‌ లభించాయి. దీంతో ధోనికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే చాహర్‌ దగ్గరకు వచ్చి కన్నెర్ర చేశాడు. అనంతరం పరిస్థితిని వివరించి ఎలా బౌలింగ్‌ చేయాలో చెప్పాడు. ధోని సలహా తర్వాత చాహర్ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. అంతేకాకుండా ఆఖరు బంతికి కీలక బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మిల్లర్‌ను ఔట్‌ చేశాడు. ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండే ధోని.. ఒక్కసారిగా ఇలా యువ బౌలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చేస్తోంది.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 160 పరుగులు చేసింది. డు ప్లెసిస్‌ (38 బంతుల్లో 54; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్‌ ధోని (23 బంతుల్లో 37 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులే చేయగలిగింది. రాహుల్‌ (47 బంతుల్లో 55; 3 ఫోర్లు, 1 సిక్స్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌ (59 బంతుల్లో 67; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాటం వృథా అయింది.  ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హర్భజన్, కుగ్లీన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

మరిన్ని వార్తలు