ఆ నిర్ణయం నా ఒక్కడిదే అంటే ఎలా?: బంగర్‌

2 Aug, 2019 15:08 IST|Sakshi

ఫ్లోరిడా: ప్రస్తుతం భారత క్రికెట్‌ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్న సంజయ్‌ బంగర్‌పై వేటు ఖాయంగా కనబడుతోంది. గత ఐదేళ్లలో రవిశాస్త్రి, అనిల్‌ కుంబ్లేలతో  కలిసి బంగర్‌ పని చేసినప్పటికీ భారత క్రికెట్‌ జట్టు బ్యాటింగ్‌ విభాగాన్ని పటిష్ట పరచలేకపోయాడనే అపవాదు బంగర్‌పై ఉంది. ముఖ్యంగా నాల్గో స్థానం ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉండటంతో బంగర్‌పై బీసీసీఐ ఆసక్తిగా లేదు. అదే సమయంలో వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోనిని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై ప్రధానంగా బంగర్‌నే టార్గెట్‌ చేశారు. ఇదే బంగర్‌ నిర్ణయమేనంటూ వార్తలు వ్యాపించాయి.

ఈ తరుణంలో బంగర్‌ స్పందించాడు.  వరల్డ్‌కప్‌లో కివీస్‌తో జరిగిన నాకౌట్‌ పోరులో ధోనిని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపిన నిర్ణయం తన ఒక్కడిదే కాదంటూ పేర్కొన్నాడు. అది సమిష్టిగా అక్కడ ఉన్న వారితో చర్చించిన తర్వాతే ధోనిని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దింపామని పేర్కొన్నాడు. ‘ ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై అంతా నన్ను టార్గెట్‌ చేస్తున్నారు. ఇది నేను ఒక్కడినే తీసుకున్న నిర్ణయం కాదు. ఆ సమయంలో అది సమంజసం అనిపించింది కాబట్టి అక్కడ ఉన్న మేమంతా కలిసి చర్చించిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకున్నాం. మిడిల్‌ ఆర్డర్‌లో ఐదు, ఆరు, ఏడు స్థానాలపై చర్చించిన తర్వాత దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యాల తర్వాత ధోనిని బ్యాటింగ్‌కు పంపాం. 30-40 ఓవర్ల స్లాబ్‌ ఆధారంగా అప్పడు ఉన్న పరిస్థితుల్ని బట్టే టీమిండియా కోచింగ్‌ విభాగం అంతా కలిసే ధోనిని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వెనక్కి పంపాల్సి వచ్చింది.  ఈ విషయంపై ఇప‍్పటికే రవిశాస్త్రి వివరణ ఇచ్చాడు. అయినా నేను ఒక్కడినే జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌పై నిర్ణయం తీసుకున్నాననంటూ నిందలు వేస్తారెందుకు’ అని బంగర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు