‘ధోని 20 ఏళ్ల యువ క్రికెటరేం కాదు’

19 Nov, 2018 13:47 IST|Sakshi

న్యూఢిల్లీ: గతంలో మాదిరి ఆడటం లేదంటూ భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిపై కొంతకాలంగా విమర్శలు వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ స్పందించాడు. ప్రస్తుతం ధోని ఫామ్‌లో లేకపోవడానికి అతను 20ఏళ్లు యువ క్రికెటర్‌ కాదంటూ తనదైన శైలిలో విమర్శలను తిప్పికొట్టాడు. ‘ఎంఎస్‌ ధోని గురించి అందరూ ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడు ధోని 20-25 ఏళ్ల వయసు మధ్యలో లేడనే విషయం గ్రహించాలి. ఆ వయసున‍్నప్పుడు ధోని దూకుడు అంతా చూశాం. ధోని నెలకొల్పిన రికార్డులు అందరికీ సుపరిచితమే. ఈ వయస్సులో కూడా అతని నుంచి అదే ఆటను ఆశించడం ముమ్మాటికి తప్పే. అతనికి ఆపారమైన అనుభవం ఉంది. ఆ అనుభవమే టీమిండియాకు సాయపడుతుంది. భారత జట్టుకు దొరికిన సంపద ధోని. అతను మరికొంత కాలం క్రికెట్‌లో కొనసాగాలంటే ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ముఖ్యం. ధోని మరిన్ని మ్యాచ్‌లు ఆడతాడనే ఆశిస్తున్నా’ అని కపిల్‌దేవ్‌ పేర్కొన్నాడు.
 
ప్రస్తుత కెప్టెన్ విరాట్‌ కోహ్లి గురించి కపిల్‌ మాట్లాడుతూ.. ‘టాలెంట్‌, అనుభవం కూడా తోడైతేనే విరాట్ కోహ్లి. అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించే ప్రత్యేకమైన వ్యక్తుల్లో కోహ్లి ఒకడు. ప్రత్యేకమైన ఆటగాడు కూడా. ప్రతిభ, కష్టపడి ఆడే స్వభావం అతడి నైజం. ఇలా టాలెంట్, కష్టపడే స్వభావం ఉన్న వ్యక్తులు సూపర్ మ్యాన్‌ మాదిరిగా తయారవుతారు. అతనిలోని క్రమశిక్షణ, నైపుణ్యమే కోహ్లిని ఉన్నత స్థానంలో నిలబెట్టింది’ అని కపిల్‌దేవ్‌ పేర్కొన్నాడు.
 

మరిన్ని వార్తలు