సంచలనం రేపుతున్న ‘ధోని రిటైర్మెంట్‌’

29 Oct, 2019 15:37 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రస్తుత భారత క్రికెట్‌లో ఎక్కువగా చర్చకు దారితీస్తున్న అంశం ‘ధోని రిటైర్మెంట్‌ ఎప్పుడు?’. ఇంగ్లండ్‌ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌ అనంతరం ధోని ఇప్పటిరకు మైదానంలో అడుగుపెట్టలేదు. ప్రపంచకప్‌ టోర్నీ ముగిసిన తర్వాత తొలి రెండు నెలలు ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో రెండు నెలలు క్రికెట్‌కు విరామమిచ్చాడు.  ఆర్మీ ట్రైనింగ్‌ ముగిసిన అనంతరం కూడా ధోని తిరిగి టీమిండియాలో చేరలేదు. అయితే ధోని తనంతట తాను ఆడటం లేదా లేక సెలక్టర్లే అతడిని పక్కకు పెడుతున్నారా అనే ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి. ఇక ధోని వీడ్కోలుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ట్విటర్‌లో ఓ హ్యాష్‌ ట్యాగ్‌ సంచలనం సృష్టిస్తోంది. 

మంగళవారం అనూహ్యంగా ట్విటర్‌లో ధోని రిటైర్మెంట్‌(#Dhoniretires) హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు ధోని సాధించిన ఘనతలు, రికార్డులను గుర్తుచేస్తూ రిటైర్మెంట్‌ హ్యాష్‌ ట్యాగ్‌ను జోడిస్తున్నారు. దీనితో పాటు #ThankYouDhoni అనే మరో హ్యాష్‌ ట్యాగ్‌ కూడా తెగ ట్రెండ్‌ అవుతోంది. దీంతో ధోని అభిమానులు తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. అయితే జార్ఖండ్‌ డైనమెట్‌ వీడ్కోలు వార్తలను ఖండిస్తున్నారు. అంతేకాకుండా అతడికి మద్దతుగా నిలుస్తూ #NeverRetireDhoni అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడిస్తున్నారు.  ఇక ధోని వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ వరకు ధోని ఆడాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. 

ఇక ధోనికి ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన యువ సంచలనం రిషభ్‌ పంత్‌ ఏ మాత్రం ఆకట్టుకోకపోవడంతో.. సెలక్టర్లు సైతం ఈ సీనియర్‌ ఆటగాడిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ క్రమంలో సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ధోనిపై ఓ క్లారిటీ వస్తుందని అందరూ భావించారు. అయితే రిటైర్మెంట్‌ విషయం ధోని వ్యక్తిగతమని, ఆ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరని గంగూలీ సింపుల్‌గా తేల్చిపారేశాడు. ఇక ధోనికి ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ ఆడించి ఘనంగా క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఇవ్వాలని సెలక్టర్లకు క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు