'ధోని ఇక జట్టులోకి రావడం కష్టమే'

18 Mar, 2020 15:59 IST|Sakshi

ఢిల్లీ : మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని భారత జట్టులోకి రావడం ఇక కష్టమేనని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. ధోని స్థానంలో ఆటగాడిని భర్తీ చేయడానికి బీసీసీఐ ఎంతో ముందుకు వెళ్లిపోయిందని అభిప్రాయపడ్డాడు. 'జట్టులో ధోనికి చోటు ఎక్కడుంది.. ఇప్పటి టీంతో అతడు ఆడలేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా రాహుల్‌ను చూసుకుంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌లలోఅద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇంకా ధోనీ గురించి ఆలోచించేందుకు కారణం ఏముంటుంది' అని అన్నాడు.
(అంత సులభంగా ఎలా మాట్లాడతారో!)

 ఇక న్యూజిలాండ్‌ పర్యటనలో విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి సెహ్వాగ్‌ మద్దతుగా నిలిచాడు. 'కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. కానీ ప్రతి ఆటగాడు తన కెరీర్‌లో ఒక సంధి దశను ఎదుర్కొంటాడు. ప్రస్తుతం కోహ్లి కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. గతంలో దిగ్గజ ఆటగాళ్లకు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. సచిన్‌ టెండూల్కర్, స్టీవ్‌ వా, జాక్వెస్‌ కలిస్‌, రికీ పాంటింగ్‌ లాంటి అత్యుత్తమ ఆటగాళ్లు గడ్డుకాలం ఎదుర్కొన్నారు. వన్డే, టెస్టుల్లో కివీస్‌ మన కన్నా అత్యుత్తమంగా ఆడిందని ఒప్పుకోవాల్సిందే. వన్డేల్లో కివీస్‌ తన మార్క్‌  స్పష్టంగా చూపెట్టింది. టీ20ల్లోనూ విజయాలకు దగ్గరగా వచ్చి ఓడిపోయింది. అయితే పొట్టి క్రికెట్లో వెంటనే పుంజుకోవడం అంత సులభం కాదు' అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. కాగా హార్దిక్‌ పాండ్యా పునారాగమనం చేయడం టీమిండియాకు శుభసూచకమని, ఆల్‌రౌండర్‌గా మరింతగా రాటుదేలుతాడని తెలిపాడు. రంజీ ట్రోపీని గెలుచుకున్న సౌరాష్ట్ర జట్టును మనస్పూర్తిగా అభినంధించాడు. ఫైనల్లో బెంగాల్‌ జట్టు తుది వరకు పోరాడి ఓడినా ఆకట్టుకుందని సెహ్వాగ్‌ తెలిపాడు.
(ఐపీఎల్‌కు ఆసీస్‌ ఆటగాళ్లు గుడ్‌ బై!)

కాగా ఐసీసీ 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఎంఎస్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత భారత్ ఆడిన ఏ సిరీస్‌కూ అందుబాటులో లేడు. దీంతో మహీ భవితవ్యంపై సందేహాలు తలెత్తాయి. దీంతో పాటు ఆరు నెలలుగా ధోనీ క్రికెట్ ఆడకపోవడంతో బీసీసీఐ అతడి కాంట్రాక్టును పునరుద్ధరించలేదు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఐపీఎల్‌-13వ సీజన్‌పై పడింది.ఐపీఎల్‌ ప్రదర్శనతో అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ధోనిని చూడాలని అతని అభిమానులు ఎంతగానో భావించారు. దీనికి తోడు మహీ కూడా ఐపీఎల్ కోసం చెన్నై వచ్చి ప్రాక్టీస్ చేసాడు. అయితే కరోనా ముప్పుతో ప్రస్తుతం ఐపీఎల్‌ వాయిదా పడింది. పరిస్థితులు మెరుగవ్వకపోతే టోర్నీని రద్దు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ధోనీ పరిస్థితి ఏంటో తెలియడం లేదు.కొందరు మాజీలు రిటైర్మెంట్ ప్రకటించాలని సూచించగా.. మరొకొందరు ఆడాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు