రోహిత్, ధోనిలపైనే భారత్‌ ఆశలు

15 Sep, 2018 04:58 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌

గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా టి20 లీగ్‌లు వెల్లువెత్తడంతో క్రికెట్‌ అభిమానుల దృష్టిలో ఆసియా కప్‌ తన ప్రాభవం కోల్పోయింది. అయితే ఆసియా ఖండంలో అగ్ర జట్టుగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉండటంతో ఆటగాళ్లు ఇప్పటికీ ఈ టోర్నీని గెలుచుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. యువకులతో నిండిన భారత జట్టుకు సారథ్యం వహించి షార్జాలో జరిగిన తొలి ఆసియా కప్‌ను గెలిపించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈసారి షార్జాలో మ్యాచ్‌లు లేకపోయినా మళ్లీ యూఏఈలో టోర్నీ జరగడం సంతోషంగా ఉంది. ఒకప్పుడు షార్జాలో బెనిఫిట్‌ మ్యాచ్‌ జరిగినా కూడా యూఏఈ దద్దరిల్లేది. అలాంటి చోట ఒక్క మ్యాచ్‌ కూడా లేకపోవడం ఆశ్చర్యకరం.  

ఆ విషయాన్ని పక్కన పెడితే వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌ కప్‌కు వార్మప్‌లాంటిది కాబట్టి ఈ టోర్నమెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ జట్టు ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే వారి సన్నాహాలు అంత మెరుగవుతాయి. వరల్డ్‌ కప్‌లోగా తమ లోపాలేమిటో తెలుసుకొని వాటిని సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఇంగ్లండ్‌తో పోలిస్తే యూఏఈలో వాతావరణం చాలా భిన్నంగా ఉంటుందనేది వాస్తవమే అయినా ఒక జట్టుగా తమ గురించి తెలుసుకునేందుకు మంచి అవకాశం లభిస్తుంది. ఏ ఆటగాడు ఒత్తిడిని అధిగమించగలడో, జట్టును నడిపించగల సత్తా లేనివాళ్లు ఎవరో కూడా గుర్తించవచ్చు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ విజేత పాకిస్తాన్‌ ఇక్కడ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అత్యంత ఆకర్షణ కలిగిన వారి మాజీ కెప్టెన్‌ ఇప్పుడు దేశ ప్రధానిగా ఉన్న నేపథ్యంలో అతనికి ఆసియా కప్‌ను కానుకగా ఇవ్వాలని వారు భావిస్తుండవచ్చు. చండిమాల్‌ దూరం కావడంతో లంక బలహీనంగా మారగా, షకీబ్‌ ఫిట్‌నెస్‌ సమస్యలతో బంగ్లాదేశ్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది.    

మరి భారత్‌ సంగతేమిటి? ఇంగ్లండ్‌లో అవమానకర రీతిలో ఓడిన తర్వాత జట్టులో ఎంతో బాధ దాగి ఉంది. అందువల్ల ఆసియా కప్‌ను గెలిచి తమ అభిమానులకు సాంత్వన కలిగించాలని వారు కోరుకుంటున్నారు. అయితే అది అంత సులువు కాదు. ప్రత్యర్థులకు భారత జట్టు లోపాలు, అనిశ్చితి గురించి బాగా తెలుసు కాబట్టి వాటిపైనే దాడి చేస్తారు. కెప్టెన్‌గా ముందుండి నడిపించాల్సిన అత్యుత్తమ వన్డే ఆటగాడు రోహిత్‌ శర్మపైనే జట్టు చాలా ఆధారపడుతోంది. రోహిత్‌కు అండగా నిలిచేందుకు, యూఈఏ ఎడారి ఎండల్లో కూడా సహనం కోల్పోకుండా చూసేందుకు ధోని కూడా ఉన్నాడు. తాజా సమస్యలను అధిగమించి పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు వీరిద్దరిదే ప్రధాన పాత్ర కానుంది.   

మరిన్ని వార్తలు