రిటైర్మెంట్‌ గురించి ధోనీ వ్యాఖ్యలు

20 Feb, 2016 09:00 IST|Sakshi
రిటైర్మెంట్‌ గురించి ధోనీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: మిస్టర్ కూల్‌ మహేంద్రసింగ్ ధోనీ మరోసారి రిటైర్మెంట్‌ గురించి స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇప్పట్లో తప్పుకోబోనని, రిటైర్మెంట్‌ గురించి అంత తొందరేమీ లేదని ధోనీ స్పష్టం చేశాడు. 2014 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో సిరీస్‌ అనంతరం ధోనీ అర్ధంతరంగా టెస్టులకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వన్డేలు, టీ-20 మ్యాచులకు ఈ 34 ఏళ్ల క్రికెటర్‌ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

ధోనీ తన సారథ్యంలో టీమిండియాకు అనేక విజయాలు అందించాడు. అతని నాయకత్వంలో 2007లో టీ -20 వరల్డ్ కప్, 2011లో వరల్డ్‌ కప్‌ భారత జట్టు సాధించింది. టెస్టుల్లోనూ అత్యుత్తమ ర్యాంకు సాధించింది. తొమ్మిదేళ్ల కిందట దక్షిణాఫ్రికాలో అందుకున్న పొట్టి మ్యాచుల వరల్డ్ కప్ ను మళ్లీ స్వదేశంలోనూ తన చేతుల మీదుగా అందుకోవాలని ఈ మిస్టర్ కూల్ కెప్టెన్ ఉవ్విళ్లూరుతున్నాడు. మళ్లీ టీ-20 వరల్డ్ కప్ సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. లైఫ్‌ స్టైల్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టిన ధోనీ ఈ సందర్భంగా శుక్రవారం విలేకరులతో మాట్లాడాడు. 'ఆసియా కప్‌, టీ-20 వరల్డ్ కప్, ఆ వెంటనే ఐపీఎల్ ఇలా వరుసపెట్టి మ్యాచులు ఉన్నాయి. ఈ క్విక్ షెడ్యూల్ ముగిసిన వెంటనే టెస్టు సిరీస్‌లు, వన్డేలు కూడా ఉన్నాయి. అందుకు క్రికెటర్లు సన్నద్ధంగా ఉండాలి' అని ధోనీ చెప్పాడు.

మార్చి 8 నుంచి ఏప్రిల్ 3 వరకు టీ -20 వరల్డ్ కప్ జరుగనుంది. ఆస్ట్రేలియా, శ్రీలంకతో వరుసగా సిరీస్‌లు గెలుచుకోవడంతో ధోనీ సారథ్యంలోని టీమిడింయా వరల్డ్‌ కప్ లోనూ సత్తా చాటుతామని ఆశిస్తోంది. అయితే ఇటీవలకాలంలో ధోనీ బ్యాటుతో ఆశించినంతగా రాణించకపోవడం కొంత  కలవరపెడుతోంది.

>
మరిన్ని వార్తలు