పెండింగ్‌లో రన్నౌట్‌.. నరాలు తెగే ఉత్కంఠ!

13 May, 2019 10:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య ఆదివారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. పలు భావోద్వేగమైన ఘట్టాలకు వేదికగా నిలిచి క్షణక్షణం ఉత్కంఠ రేపింది. ఫలితం కోసం చివరి ఓవర్‌ చివరి బంతి వరకు కొనసాగిన ఈ ఉత్కంఠభరిత థ్రిల్లర్‌ మ్యాచ్‌లో కేవలం ఒకే పరుగు తేడాతో ముంబై గట్టెక్కి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

ముఖ్యంగా చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ రన్నౌట్‌ నిర్ణయాన్ని థర్డ్‌ అంపైర్‌కు నివేదించడం.. మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠ రేపింది. బెస్ట్‌ మ్యాచ్‌ ఫినిషర్‌గా పేరొందిన ధోనీ.. లక్ష్య ఛేదనలో జట్టుకు ఎంతో అవసరమైన దశలో.. అతడు రన్నౌట్‌ అయ్యాడా? లేదా? అన్నది తేల్చే బాధ్యత థర్డ్‌ అంపైర్‌పై పడింది. హార్దిక్‌ పాండ్యా వేసిన 13వ ఓవర్‌ రెండో బంతిని స్ట్రయికింగ్‌లో ఉన్న షేన్‌ వాట్సన్‌ షార్ట్‌ ఫైన్‌లెగ్‌లో దిశగా తరలించాడు. దీంతో సింగిల్‌ వచ్చింది. అయితే, అక్కడ ఉన్న లసిత్‌ మలింగా ఓవర్‌త్రో విసరడంతో మరొక పరుగు కోసం ఇద్దరు ప్రయత్నించారు. బంతిని వేగంగా అందుకున్న ఇషాన్‌ కిషన్‌ బౌలర్స్‌ ఎండ్‌ వైపుగా ఉన్న స్టంప్స్‌కు నేరుగా విసిరాడు. బంతి వికెట్లకు తగలడంతో తీర్పు ఇచ్చే బాధ్యతను గ్రౌండ్‌ అంపైర్‌.. థర్డ్‌ అంపైర్‌కు అప్పగించారు. థర్డ్‌ అంపైర్‌ నిగేల్‌ లాంజ్‌ వివిధ కోణాల్లో విశ్లేషణ జరిపేందుకు సమయం తీసుకున్నాడు. ఒక కోణంలో ధోనీ బంతి వికెట్లకు తగలకముందే లైన్‌ను దాటినట్టు కనిపించింది. మరో కోణంలో మాత్రం లైన్‌కు కొద్దిగా అటు-ఇటు ఉన్నట్టు కనిపించింది. దీంతో థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయం పెండింగ్‌లో ఉన్నంతసేపు మైదానం భావోద్వేగాలతో క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారిపోయింది. ధోనీని ఔట్‌ అని ప్రకటించడంతో చెన్నై అభిమానులు ఉసూరుమన్నారు. మరోవైపు ధోనీ రన్నౌట్‌ నిర్ణయంపై వివాదం ముసురుకునే అవకాశం కనిపిస్తోంది. అసలు ధోనీ రన్నౌట్‌ కాకపోయినా.. లైన్‌ దాటినట్టు వీడియోలో స్పష్టంగా కనిపించకపోయినా.. ఔట్‌ ఇచ్చారని చెన్నై అభిమానులు సోషల్‌ మీడియాలో మండిపడుతున్నారు. 

సింగిల్స్‌ తీయడంలో సిద్ధహస్తుడైన ధోనీ రన్నౌట్‌ కావడమన్నది అత్యంత అరుదు అని చెప్పాలి. ఈ సీజన్‌లో చివరిసారిగా ముంబై ఇండియన్స్‌పై మ్యాచ్‌లోనే ధోనీ రన్నౌట్‌ అయ్యాడు. ఈ మ్యాచ్‌ చెన్నై ఓడిపోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు 2017లో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ తరఫున ఆడిన ధోనీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఓసారి రన్నౌట్‌ అయ్యాడు.

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి :
తీవ్ర ఉత్కంఠ రేపిన దోని రన్నౌట్‌

మరిన్ని వార్తలు