భార‌త అభిమానుల గుండె ప‌గిలిన రోజు

10 Jul, 2020 16:27 IST|Sakshi

ముంబై :  2019.. జూలై 10వ తేది.. ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఇండియా, న్యూజిలాండ్ మ‌ధ్య సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌. భార‌త విజ‌య‌ల‌క్ష్యం 240 ప‌రుగులు. అప్ప‌టికే టీమిండియా 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఈ ద‌శ‌లో క్రీజులో ఉన్న ఎంఎస్ ధోని, ర‌వీంద్ర జ‌డేజాలు జ‌ట్టును ఓట‌మి నుంచి త‌ప్పించే బాధ్య‌త‌ను భుజానికెత్తుకున్నారు. ఇద్ద‌రు క‌లిపి 7వ వికెట్‌కు అబేధ్య‌మైన 116 ప‌రుగులు జోడించారు. కాగా జ‌ట్టు స్కోరు 207 ప‌రుగుల వ‌ద్ద ఉన్న‌ప్పుడు 77 ప‌రుగులు చేసిన జ‌డేజా క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అయినా భార‌త అభిమానులు ఏ మాత్రం బెద‌ర‌లేదు .. ఎందుకంటే అప్ప‌టికే ధ‌నాద‌న్ ధోని క్రీజులో పాతుకుపోయాడు.  

ధోని ఉన్నాడన్న ధైర్యం అభిమానుల‌ను కుంగిపోకుండా చేసింది. 2011 ఫైన‌ల్ ప్ర‌ద‌ర్శన‌ను మ‌రోసారి పునరావృతం చేస్తాడ‌ని, లార్డ్స్‌లో జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌లో టీమిండియా ఉంటుంద‌ని అంతా భావించారు.అయితే విజ‌యానికి 24 ప‌రుగుల దూరంలో ఉన్న‌ప్పుడు ధోని ర‌నౌట్ అయ్యాడు. అంతే స్టేడియం మొత్తం ఒక్క‌సారిగా నిశ‌బ్ధంగా మారిపోయింది. ఇది నిజమా కాదా అని నిర్థారించుకునేలోపే ధోని పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. అప్ప‌టిదాకా ధోని ఉన్నా‌డ‌నే ధైర్యంతో ముందుకు సాగిన అభిమానుల గుండెలు ప‌గిలాయి. టీమిండియాను ఫైన‌ల్లో చూస్తామ‌న్న వారి క‌ల‌ల ఆవిర‌య్యాయి. చూస్తుండగానే భార‌త ఇన్నింగ్స్ కుప్ప‌కూలింది. కేవ‌లం 18 ప‌రుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడి ఇంటిబాట ప‌ట్టింది.('కెప్టెన్‌గా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వ‌లేదు')

అప్ప‌టిదాకా ధోని మీద అభిమానం ఉన్న‌వాళ్లు కూడా.. ధోని ఎందుకిలా చేశాడు.. ఒక్క ప‌రుగుతో స‌రిపెట్టుకుంటే ఫ‌లితం వేరేలా వ‌చ్చి ఉండేది అంటూ దుమ్మెత్తిపోశారు. యాదృదశ్చిక‌మె లేక దుర‌దృష్ట‌మో తెలియ‌దు గాని మహీ చివరిసారిగా మైదానంలో కనిపించింది ఆరోజే. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు బ్లూ జెర్సీ ధరించలేదు.ఈ బాధ‌ భార‌త్ క్రికెట్‌తో పాటు అభిమానుల‌ను కూడా చాలా కాలం వెంటాడింది. స‌రిగ్గా ఈ ఘ‌ట‌న జ‌రిగి ఈ రోజుకు ఏడాది. ఐసీసీ ఈ విష‌యాన్ని మ‌రోసారి గుర్తు చేస్తూ ట్విట‌ర్‌లో ధోని ర‌నౌట్ వీడియోను షేర్ చేసింది. 'భార‌త అభిమానుల గుండె ప‌గిలిన స‌న్నివేశం ఇది' అంటూ క్యాప్ష‌న్ జ‌త చేశారు. 

కాగా అప్ప‌టి 2019 ప్ర‌పంచక‌ప్‌‌ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా రిజ‌ర్వ్ డే రోజు కూడా ఆడాల్సి వ‌చ్చింది. జూలై 9, 2019న  టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న కేన్ విలియ‌మ్స‌న్ సేన‌ను భూవీ, బుమ్రా జోడి క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్‌తో ముప్ప‌తిప్ప‌లు పెట్టింది. కివీస్ జ‌ట్టులో కెప్టెన్ విలియ‌మ్‌స‌న్‌, రాస్ టేల‌ర్ అర్థ‌సెంచ‌రీల‌తో రాణించ‌డంతో 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల నష్టానికి 239 ప‌రుగులు చేసింది. ఈ ద‌శ‌లో మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌ల‌గ‌డంతో మ్యాచ్‌ను రిజ‌ర్వ్ డేకు వాయిదా వేసింది. మ‌రుస‌టి రోజు 240 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ టాప్ ఆర్డ‌ర్ విఫ‌లంతో 49.3 ఓవ‌ర్ల‌లో 221 ప‌రుగులు వ‌ద్ద ఆలౌటైంది.   

మరిన్ని వార్తలు