ధోని పేరిట అరుదైన ఘనత!

10 Feb, 2019 13:09 IST|Sakshi

హామిల్టన్‌ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ ధోనికి ఓవరాల్‌గా 300వ టీ20 కాగా.. ఈ ఘనతను అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా ఈ మిస్టర్‌ కూల్‌ నిలిచాడు. భారత్‌ తరఫున 96 అంతర్జాతీయ టీ20లకు ప్రాతినిధ్యం వహించిన ధోని.. భారత క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ల్లో 175, ఛాంపియన్స్‌ టీ20 లీగ్‌లో 24, జార్ఖండ్‌ తరఫున 4, ఫస్ట్‌ క్లాస్‌ టీ20లో 1 మ్యాచ్‌తో కలిపి మొత్తం 300 మ్యాచ్‌లు ఆడాడు.

తద్వారా 300 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోని చేరాడు.ఈ జాబితాలో విండీస్‌ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ 446 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. క్రిస్‌గేల్‌, డ్వేన్‌ బ్రేవో, షోయబ్‌ మాలిక్‌లు ధోని కన్నా ముందున్నారు. ఇక  ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రైజింగ్‌ పుణె జట్ల తరఫున ధోని ఆడిన విషయం తెలిసిందే. భారత్‌ తరఫున రోహిత్‌ శర్మ 298, సురేశ్‌ రైనా 296 మ్యాచ్‌లతో ధోని తర్వాతి స్థానంలో ఉన్నారు. ధోని ఈ ఫీట్‌ అందుకున్న సందర్భంగా సోషల్‌మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో బ్యాట్‌తో రఫ్పాడించిన ధోని.. కివీస్‌ పర్యటనలో కూడా తన మార్క్‌ కీపింగ్‌, బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. 

మరిన్ని వార్తలు