ధోని రిటైర్మెంట్‌ ప్రకటించనున్నాడా?

18 Jul, 2018 12:48 IST|Sakshi
బంతిని తీసుకుంటున్న ధోని

అవకాశం ఉందంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌

లీడ్స్‌: సుదీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటనను టీ20 సిరీస్‌ విజయంతో ఆరంభించిన టీమిండియా.. వన్డే సిరీస్‌లో మాత్రం చతికిలపడింది. మంగళవారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్‌పై 8 వికెట్ల తేడాతో నెగ్గి ఇంగ్లండ్‌ సిరీస్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్‌ కోల్పోవడంతో ఆగ్రహానికి గురైన అభిమానులు కొందరి ఆటగాళ్ల ఆటతీరు పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా టీమిండియా మాజీ సారథి, సీనియర్‌ ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోనిపై తారాస్థాయిలో విమర్శల వర్షం కురుస్తోంది. ధోనిని ఇంకా ఎందుకు ఆడిస్తున్నావంటూ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మ్యాచ్‌ అనంతరం రిటైర్మెంట్‌కు ఊహగానాలకు తెరదీస్తూ ధోనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. 

అసలు విషయమేమిటంటే..
ఏ క్రికెటరైనా తాను ఆడిన చివరి మ్యాచ్‌కు సంబంధించిన బంతిని గానీ వికెట్‌ను గానీ తీసుకొని గుర్తుగా ఉంచుకుంటారు. మంగళవారం మ్యాచ్‌ జరిగిన అనంతరం ధోని అంపైర్ల నుంచి బంతి తీసుకోవడంతో ఈ మాజీ సారథి వీడ్కోలు పలుకనున్నాడంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు డ్రాగా ముగిసిన అనంతరం ధోని వికెట్‌ను తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌ తర్వాతే అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించి షాకిచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ అనంతరం బాల్‌ తీసుకోవడంతో ఏ క్షణమైనా వీడ్కోలు ప్రకిటించే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

వైఫల్యం.. తాజాగా ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఘోర వైఫల్యం చెందిన ధోనిపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. బౌలర్‌ ఎవరైనా.. పిచ్‌ ఏదైనా.. ధాటిగా ఆడి అవలీలగా బౌండరీలు బాదే ధోని.. ఈ సిరీస్‌లో మాత్రం పరుగులు తీయడానికే నానాతంటాలు పడ్డాడు.  ఇక కీపింగ్‌లో కూడా వేగం తగ్గిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిషబ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌ ఫామ్‌లో ఉండటం, కొత్తవాళ్లకు అవకాశమివ్వాలనే ఉద్దేశంతో ప్రపంచకప్‌ సన్నాహకాల కంటే  ముందే ధోని రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు