‘గాయమైనా ధోని దేశం కోసం ఆడాడు’

3 Jul, 2019 16:10 IST|Sakshi

క్రికెట్‌ మెగాటోర్నీ ప్రపంచకప్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోని ప్రదర్శనపై విమర్శలు కొనసాగుతున్నాయి. పరుగులు చేయడానికి ధోని బాగా ఇబ్బంది పడుతున్నాడని.. అతడి కారణంగానే జట్టు భారీ స్కోరు చేయలేకపోతుందని సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ధోని నెమ్మదిగా ఆడటం వల్లే 350కి పైగా స్కోరు చేసే అవకాశం చేజారిందని మాజీ ఆటగాళ్లు కూడా విమర్శిస్తున్నారు. ఇంగ్లండ్‌, అఫ్గనిస్తాన్‌ మ్యాచ్‌ల్లోనూ అతడి ప్రదర్శన గొప్పగా లేదని.. తనకు కొట్టిన పిండి అయిన వికెట్‌ కీపింగ్‌లోనూ ధోని రాణించడం లేదని పెదవి విరుస్తున్నారు. ఇక ఆతిధ్య జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ధోని-జాదవ్‌ కారణంగానే ఈ ప్రపంచకప్‌లో తొలి ఓటమి చవిచూడాల్సి వచ్చిందని తీవ్ర ఆగ్రహం పెల్లుబుకిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ధోనిపై వస్తున్న విమర్శలపై అతడి అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆదివారం నాటి మ్యాచ్‌లో బొటనవేలికి గాయమైనప్పటికీ బాధను దిగమింగి ధోని బ్యాటింగ్‌ చేశాడని.. అతడికి జట్టు ప్రయోజనాలే ముఖ్యమని కామెంట్లు చేస్తున్నారు. ‘ ఏదో ఒకరోజు ధోని ఎవరికీ చెప్పా పెట్టకుండా జట్టును విడిచి వెళ్లిపోతాడు. అప్పుడు అతడు దూరమయ్యాడే అనే బాధతో మీరే విలవిల్లాలాడాల్సి వస్తుంది. ధోనీ టీమిండియాతో ఉండటం వల్ల ఎన్ని విజయాలు లభించాయో మర్చిపోయారా ఎక్స్‌పర్ట్స్‌. తన వేలికి గాయమైనా జట్టు ప్రయోజనాల కోసం ధోని బాధను దిగమింగాడు. అయినా మీకు ఇవేమీ పట్టవు. తనను ఆడిపోసుకోవడమే పని. ఈ ప్రపంచంలో నిన్ను విమర్శించే వాళ్లంతా పిచ్చివాళ్లే. మేము ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం ధోని అంటూ గాయమైన వేలి నుంచి వస్తున్న రక్తాన్ని ధోని ఉమ్మివేస్తున్న ఫొటోను ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తున్నారు. మిస్టర్‌ కూల్‌ అంకితభావాన్ని ప్రశ్నించేవారికి ఈ ఫొటోనే సమాధానం చెబుతుందంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు.

కాగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని 31 బంతుల్లో 42 పరుగులు (నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), అప్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో 28 పరుగులు, మంగళవారం బంగ్లాతో మ్యాచ్‌లో 35 పరుగులు చేశాడు. ఇక కీపింగ్‌ విషయానికి వస్తే ఆదివారం నాటికి ప్రపంచకప్‌లో అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన జాబితాలో చివరి నుంచి మూడో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు