‘మంచు’ కరిగింది...

5 Jan, 2017 00:39 IST|Sakshi
‘మంచు’ కరిగింది...

సాక్షి క్రీడా విభాగం ‘అవసరమైతే దూసుకొస్తున్న ట్రక్‌కు ఎదురుగా నిలబడగల జట్టు నాకు కావాలి’... కెప్టెన్‌ అయిన కొత్తలోనే ధోని నోటి నుంచి వచ్చిన పదునైన మాట ఇది. కొండనైనా ఢీకొట్టేందుకు సిద్ధమనే తత్వం అతనిది. జట్టు ప్రయోజనాల ముందు ఆటగాళ్ల పేరు ప్రఖ్యాతలు, సీనియార్టీలు అతనికి పట్టవు. టీమ్‌కు పనికి రారు అనుకుంటే ‘ఆ ముగ్గురు’ తనకు అవసరం లేదంటూ కరాఖండిగా చెప్పగల మొనగాడు ధోని. గొప్ప నేపథ్యం లేదు, పెద్దల అండదండలూ లేవు. కానీ అతను నాయకుడిగా భారత క్రికెట్‌ను శాసించాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ చెలరేగిపోతున్నాడు, బౌలర్లు చేతులెత్తేశారు...అయితే ఏంటి ఆ ముఖంలో ఎక్కడైనా ఆందోళన కనిపించిందా! నరాలు తెగే ఉత్కంఠ, మైదానంలో వేలాది మంది ప్రేక్షకులు... తన ఒక్క నిర్ణయం ఫలితం మార్చేస్తుంది, జీవిత కాలం అది చేదు జ్ఞాపకంలా వెంటాడే ప్రమాదం ఉంది.

కానీ అతను భయపడలేదు! నాయకుడు అంటే మైదానంలో హడావిడి చేస్తూ కేకలు పెట్టడం కాదు, ‘మిస్టర్‌ కూల్‌’లా చల్లగా ఉంటూ కూడా నిర్ణయాలు తీసుకోవచ్చనేది ధోని వచ్చాకే క్రికెట్‌ ప్రపంచం తెలుసుకుంది. 2007 టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో యూసుఫ్‌ పఠాన్‌తో ఓపెనింగ్‌ చేయించే సాహసం చేసినా, జోగీందర్‌ శర్మతో చివరి ఓవర్‌ వేయించే వ్యూహం రచించినా... అది  ఆటగాళ్లపై అతను ఉంచిన నమ్మకం. ఒక్కసారి తాను ఆటగాడిని నమ్మితే ఫలితం రాబట్టే వరకు ఆ ఆటగాడికి అండగా నిలవడం ధోని నైజం. అది రోహిత్‌ శర్మ కావచ్చు, సురేశ్‌ రైనా కావచ్చు. కావాల్సిన జట్టు కోసం సెలక్టర్లనే ఎదిరించిన సమయంలో అతనిలో ఒక నియంత కనిపించాడు. కానీ తాను ఏం చేసినా ఫలితాల కోసమే అంటూ చేసి చూపించగలడం ఎమ్మెస్‌కే చెల్లింది. తనకే సాధ్యమైన శైలి, సంప్రదాయ విరుద్ధమైన ఆలోచనలు, వ్యూహాలు ధోనిని స్పెషల్‌  కెప్టెన్‌గా మార్చేశాయి.

 సీనియర్‌ స్థాయిలో పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేకపోయినా... కుర్రాళ్ల ఆట టి20లో తొలిసారి 2007 ప్రపంచకప్‌తో నాయకుడిగా తొలి అడుగు వేసిన ధోని, ఆ తర్వాత ఇంతింతై వటుడింతై తారాపథానికి చేరుకున్నాడు. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ, వెల కట్టలేని విజయాలు అందించిన అత్యుత్తమ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. 2007 టి20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్‌ కప్, 2013లో చాంపియన్స్‌ ట్రోఫీ సాధించి మూడు ఐసీసీ టైటిల్స్‌ను గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. ఇక 2008లో ఆస్ట్రేలియా గడ్డపై అదే జట్టును వరుసగా రెండు ఫైనల్స్‌లో ఓడించి సాధించిన ముక్కోణపు టోర్నీ విజయం క్రెడిట్‌ పూర్తిగా ధోనికే దక్కుతుంది. ఇక కేవలం అతని నాయకత్వ ప్రతిభతోనే సొంతం అయిన మ్యాచ్‌లకైతే లెక్కే లేదు.

ఎన్ని విజయాలు సాధించినా, వేడుకల్లో అతను ముందు కనిపించడు. సహచరుల సంబరాల్లోనే తన ఆనందం వెతుక్కునే తత్వం ధోని వ్యక్తిత్వాన్ని కూడా గొప్పగా చూపిస్తుంది. 90 టెస్టుల తర్వాత ఆట ముగించాడు, 199 వన్డేలకు నాయకత్వానికి గుడ్‌బై చెప్పాడు. గణాంకాలను, రికార్డులను పట్టించుకోని నిస్వార్థం ధోని స్పెషల్‌. ఎన్నో మధుర జ్ఞాపకాలు... ఎన్నో ఉద్వేగ భరిత క్షణాలు ధోని కెప్టెన్‌గా మనకు అందించాడు. అతను నాయకత్వం వహించిన తొలి టి20 మ్యాచ్, తొలి వన్డే మ్యాచ్‌లలో వర్షం కారణంగా ఫలితమే రాలేదు. కానీ ఆ తర్వాత తొమ్మిదేళ్ల పాటు భారత అభిమానులమంతా అతను అందించిన విజయాల వానలో తడిసి ముద్దయ్యాం!  

మరిన్ని వార్తలు