బౌలింగ్‌ చేస్తావా.. నిన్నే మార్చాలా : ధోని

26 Sep, 2018 16:17 IST|Sakshi

మిస్టర్‌కూల్‌ ధోనికి కోపం తెప్పించిన కుల్దీప్‌ యాదవ్‌

దుబాయ్‌ : మైదానంలో ఎప్పుడూ మిస్టర్‌ కూల్‌గా వ్యవహరించే టీమిండియా మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోనికి కోపమొచ్చింది. ఆసియాకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. తనదైన కెప్టెన్సీతో భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన ధోని.. ఫీల్డింగ్‌ సెట్‌ చేసే విషయంలో బౌలర్లను అంతగా అనుమతించడు. అయితే, ఫీల్డర్‌ను తను చెప్పిన చోట కాకుండా.. వేరే చోటుకు మారుస్తున్న కుల్దీప్‌పై ధోని అసహనం వ్యక్తం చేశాడు. ‘బౌలింగ్‌ చేస్తావా..! లేదా మరో బౌలర్‌ని పిలవాలా..!’అంటూ వ్యాఖ్యానించాడు. ఇది అక్కడున్న మైక్రోఫోన్‌లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : ‘ధోనిని ఔట్‌ చేసింది రాహులే‌’)

మిస్టర్‌ కూల్‌కి కోపం తెప్పించిన కుల్దీప్‌పై కామెంట్ల వర్షం కురుస్తోంది. ధోనికే ఫీల్డర్‌ను ఎక్కడ పెట్టాలో చెప్తావా.. అనుభవించు అంటూ పలువురు చమత్కరిస్తున్నారు.ఎంతో సాఫ్ట్‌గా, కూల్‌గా కనిపించే ధోనీ మైదానంలో ఆటగాళ్ల విషయంలో మాత్రం కాస్త కఠినంగానే ఉంటాడు. వాళ్లపై తనదైన స్టైల్‌లో సెటైర్లు వేస్తుంటాడు. గతంలోనూ ఓసారి శ్రీశాంత్‌కు ధోనీ ఇలాగే వార్నింగ్ ఇచ్చాడు. ‘ఓయ్ శ్రీ అక్కడ నీ గర్ల్‌ఫ్రెండ్ లేదు.. కొంచెం ఇక్కడ ఫీల్డింగ్‌ చెయ్‌’. అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు విశ్రాంతినివ్వడంతో ధోని ఈ మ్యాచ్‌కు కెప్టెన్సీ వహించిన సంగతి తెలిసిందే.

కాగా,  టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. షహజాద్‌ (116 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా, మొహమ్మద్‌ నబీ (56 బంతుల్లో 64; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. జడేజాకు 3 వికెట్లు దక్కాయి. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు చివరి ఓవర్లో విజయానికి భారత్‌కు 7 పరుగులు కావాలి. జడేజా క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగు బంతుల తర్వాత స్కోర్లు సమమయ్యాయి. మరో రెండు బంతుల్లో సింగిల్‌ తీయాల్సి ఉండగా జడేజా బంతిని గాల్లోకి లేపాడు. అంతే... ఆ క్యాచ్‌తో మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది. (చదవండి : ఊరించి... ఉత్కం‘టై’) 

మరిన్ని వార్తలు