ధోని ముఖం చాటేశాడు..!

1 Oct, 2017 16:22 IST|Sakshi

బెంగళూరు:ప్రపంచ క్రికెట్ లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిది ప్రత్యేక స్థానం. అటు కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా ధోని సాధించిన ఘనతలు అసాధారణం. భారత క్రికెట్ కెప్టెన్ గా 'సక్సెస్ ఫుల్' ఘనతను సొంతం చేసుకున్న ధోని.. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో వంద స్టంపింగ్ లు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డును తన పేరిటి లిఖించుకున్నాడు. ప్రధానంగా ధోని అంటే స్టంపింగ్.. స్టంపింగ్ అంటే ధోని అనే కీర్తిని ఘడించాడు. కాగా, ఎప్పుడూ వికెట్ల వెనుక చురుగ్గా ఉండే ధోని.. ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన నాల్గో వన్డేలో సులువైన స్టంపింగ్ ను వదిలేశాడు. అది కూడా స్టార్ ఓపెనర్ అరోన్ ఫించ్ ది. అయితే ఆ స్టంపింగ్ ను వదిలేసిన తరువాత ధోని తనకు తానే చిన్నబుచ్చుకున్నాడు.తాను చేసిన పొరపాటు ఎంత విలువైందో గ్రహించి కాసేపు ముఖం చాటేశాడు.

వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో ఇన్నింగ్స్‌ 23వ ఓవర్ వేసిన యజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో ఓపెనర్ అరోన్ ఫించ్ బంతిని హిట్ చేసేందుకు క్రీజు వెలుపలికి వెళ్లాడు. చాహల్ విసిరిన ఫ్లైటెడ్ డెలివరీని ఫించ్ భారీ షాట్ ఆడేందుకు యత్నించాడు. కాగా, ఆ బంతి బ్యాట్ కు అందకుండా వెనక్కివచ్చినా.. ధోని బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. అప్పటికి ఫించ్ స్కోరు 47 పరుగులు. ఆపై 94 పరుగుల్ని ఫించ్ సాధించి ఆసీస్ భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. అయితే సులువైన ధోని అందుకోవడంలో విఫలం కావడంతో అంతా ఒకింత విస్తుపోయారు. ఇప్పటివరకూ 305 వన్డే మ్యాచ్ లు ఆడిన ధోని 103 స్టంపింగ్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

మరిన్ని వార్తలు