ధోనీ మాట.. కోహ్లీకి శాసనం!

26 Oct, 2017 19:32 IST|Sakshi

పుణే : న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో ఓటమితో లోపాలను సరిదిద్దుకున్న టీమిండియా రెండో వన్డే పుణేలో సత్తా చాటింది. 6 వికెట్ల తేడాతో కోహ్లీ సేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర ధోనీ చిట్కాలు భారత్ విజయానికి బాటలు వేశాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబయి వన్డేలో సెంచరీతో చెలరేగిన టామ్ లాథమ్ (38)ని కట్టడి చేసేందుకు ధోనీ వ్యూహాలు దోహం చేశాయి. ఈ క్రమంలో వన్డే ఫార్మాట్ లో సొంతగడ్డపై రెండొందల క్యాచ్ లను పట్టిన తొలి భారత వికెట్ కీపర్ గా రికార్డు నెలకొల్పాడు.

కోహ్లీని ముద్దుపేరు (చీకు) తో పిలుస్తూ.. జాదవ్ బౌలింగ్ లో బౌలర్‌తో పాటు కెప్టెన్ కూ సలహాలిచ్చాడు. ఆ సమయంలో రాస్ టేలర్ కూడా మరో ఎండ్ లో ఉన్నాడు. స్టంప్ మైక్‌లో కొంత సంభాషణ రికార్డైంది. 'ఎక్స్ ట్రా కవర్‌లో లాథమ్ వికెట్ కోసం ఇద్దరు లేదా ముగ్గురిని ఉంచు' అంటూ కోహ్లీకి సూచించాడు ధోనీ. ఓ వైపు బౌలర్ కేదార్ జాదవ్‌కు ఏ బంతి ఎలా వేయాలో చెబుతూ.. మరోవైపు కెప్టెన్ కోహ్లీకి సీనియర్ సహచరుడిగా తోడ్పాటు అందించాడు. 'మరో బంతి వరకు ఫీల్డర్‌ను అక్కడి నుంచి జరపొద్దు. క్యాచ్ కోసం అక్కడ ఫీల్డర్‌ ఉంటే మంచిది' అంటూ ధోనీ చెప్పగా కోహ్లీ శ్రద్ధగా ఆ మాటలు పాటించాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పుణే వన్డే విజయంతో కివీస్ తో సిరీస్ 1-1తో సమమైంది. చివరిదైన మూడో వన్డే నెగ్గి సిరీస్ 2-1తో కైవసం చేసుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది.

మరిన్ని వార్తలు