మళ్లీ ధోని కెప్టెన్‌ అయ్యాడోచ్..

25 Sep, 2018 16:55 IST|Sakshi

దుబాయ్: సుదీర్ఘ విరామం తర్వాత ఎంఎస్‌ ధోని మరొకసారి టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆసియాకప్‌లో భాగంగా మంగళవారం అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ధోనికి సారథ్య బాధ్యతలు అప్పగించారు. దీనిలో భాగంగానే టాస్‌కు టీమిండియా తరపున ఫీల్డ్‌లోకి ధోని రావడంతో స్టేడియంలో ఒకింత ఆశ్చర్యం నెలకొనగా, మరొకవైపు మంచి జోష్‌ కనిపించింది.

ఈ మ్యాచ్‌ నుంచి రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లకు విశ్రాంతి నివ్వడంతో ధోనికి కెప్టెన‍్సీ పగ్గాలు అప్పచెప్పింది టీమిండియా మేనేజ్‌మెంట్‌. దాంతో కెప్టెన్సీలో ‘డబుల్‌ సెంచరీ’ కొట్టనున్నాడు ధోని. ఇప్పటివరకూ 199 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని.. తాజా మ్యాచ్‌తో మరో అరుదైన మార్కును చేరబోతున్నాడు. గతంలో ధోని సారథ్యంలో భారత్‌ జట్టు 199 వన్డేలకు గాను 110 గెలవగా, 74 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. కాగా, 97 మ్యాచ్‌ల్లో ధోని టాస్‌ గెలవడం ఇక‍్కడ మరో విశేషం.

ఇదిలా ఉంచితే, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గాన్‌ ముందుగా బ్యాటింగ్‌ తీసుకుంది. టాస్‌ గెలిచిన అస్ఘార్‌ అఫ్గాన్‌ బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇప్పటికే భారత్‌ ఫైనల్‌కు చేరగా, అఫ్గాన్‌ పోరు నుంచి నిష్క్రమించింది. దాంతో ఇరు జట్లుకు ఇది నామమాత్రపు మ్యాచ్‌. ఆ క్రమంలోనే భారత జట్టు ప్రయోగాలకు సిద్ధమైంది. దీంతో జట్టులోకి కేఎల్‌ రాహుల్‌, మనీష్‌ పాండే, దీపక్‌ చాహర్‌, సిద్దార్థ్‌ కౌల్‌, ఖలీల్‌ అహ్మద్‌లు వచ్చారు.

భారత తుది జట్టు: కేఎల్‌ రాహుల్‌, అంబటి రాయుడు, మనీష్‌ పాండే, ఎంఎస్‌ ధోని, దినేశ్‌ కార్తీక్‌, కేదర్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, సిద్దార్థ్‌ కౌల్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌

అఫ్గాన్‌ తుది జట్టు: మొహ్మద్‌ షహజాద్‌, జావెద్‌ అహ్మాదీ, రెహ్మాత్‌ షా, హస్మతుల్లా షాహిది, అస్ఘార్‌ అఫ్గాన్‌, నజీబుల్లా జద్రాన్‌, మొహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌, గుల్బాదిన్‌ నాయిబ్‌, అలమ్‌, ముజిబ్‌ ఉర్‌ రహ్మాన్‌

మరిన్ని వార్తలు