రిటైర్మెంట్‌ తర్వాత... పెయింటర్‌గా మారుతానన్న ధోని  

21 May, 2019 00:45 IST|Sakshi

న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్‌ ధోని... భారత్‌ను రెండు ప్రపంచకప్‌లలో (టి20, వన్డే) విజేతగా నిలబెట్టిన మాజీ సారథి. ఇపుడు నాలుగో వన్డే ప్రపంచకప్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అది ముగిశాక రిటైర్మెంట్‌కు రెడీ అయ్యాడు. అందుకేనేమో బైబై తర్వాత తన పెయింటింగ్‌ కళను బయటికి తీస్తానని చెబుతున్నాడు. తన చిన్ననాటి కల అని పేర్కొన్న ధోని ఇప్పటికే పలు పెయింటింగ్‌లు వేశానని చెప్పుకొచ్చాడు. తను సామాజిక సైట్‌లో పెట్టిన వీడియోలో ఇంకా ఏమన్నాడంటే... ‘నేను మీతో ఓ రహస్యాన్ని చెప్పాలనుకుంటున్నా.

చిన్నప్పటి నుంచి నేను చిత్రకారుడిని కావాలని కలలు కన్నా. ఇప్పటిదాకా ఎంతో క్రికెట్‌ ఆడేశా. ఇక రిటైర్మెంట్‌ తర్వాత నా బాల్య స్వప్నాన్ని నెరవేర్చుకునే పనిలో ఉంటా’ అని 37 ఏళ్ల ధోని అన్నాడు. తను ఇదివరకే వేసిన పెయింటింగ్‌ల ముచ్చటని ఆ వీడియోలో పంచుకున్నాడు. త్వరలోనే తను పెయింటింగ్‌ ప్రదర్శన (ఎగ్జిబిషన్‌) నిర్వహిస్తానని, వాటిని చూసిన అభిమానుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తానని చెప్పాడు.    
 

మరిన్ని వార్తలు