‘ధోనికి చాలా సిగ్గు.. ఆ తర్వాతే మారాడు’

7 May, 2020 10:41 IST|Sakshi
ఎంఎస్‌ ధోని-హర్భజన్‌(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టులో అరంగేట్రం చేసిన సమయంలో ఎంఎస్‌ ధోని చాలా సిగ్గు పడేవాడని వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తెలిపాడు. తన అంతర్జాతీయ కెరీర్‌ తొలినాళ్లలో డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లడానికి కూడా ధోని సిగ్గుపడేవాడన్నాడు. అదే సిగ్గు ధోని కెప్టెన్‌ అయ్యాక కూడా చూశానని భజ్జీ పేర్కొన్నాడు. ప్రధానంగా విదేశీ టూర్లలో సహచర ఆటగాళ్లతో మాట్లాడటానికి ధోని సంకోచించేవాడన్నాడు. సారథిగా అయిన తర్వాత కూడా సలహాలు ఇవ్వడంలో ధోని కాస్త తటపటాయించే వాడన్నాడు. ఎవరికి ఏమి చెబితే ఏమనుకుంటారో అనే సందిగ్థంలో ఉండేవాడన్నాడు. కాగా, 2008లో సిడ్నీ టెస్టు తర్వాత ధోనిలో అనూహ్య మార్పులు వచ్చాయన్నాడు. ఆనాటి సిడ్నీ టెస్టులో ‘మంకీ గేట్‌’ వివాదం తర్వాత ధోని ఫ్రీగా ఉండటం చూశానన్నాడు. ‘ 2008 వరకూ ధోనికి భలే సిగ్గు. ఏమీ మాట్లాడేవాడు కాదు.. ఏమీ చెప్పేవాడు కాదు. కెప్టెన్‌ అయ్యాక కూడా మా వద్దకు వచ్చి సలహాలు ఇవ్వడానికి భయపడేవాడు. (‘ఆసీస్‌తో టీమిండియాను పోల్చలేం’)

ఇది ధోనిలో సిగ్గు అనే విషయాన్ని అప్పుడే గ్రహించా. మేము కలిసి చాలా క్రికెట్‌ ఆడాం. వెస్టిండీస్‌, శ్రీలంక, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా ఇలా చాలా విదేశీ పర్యటనలే చేశాం. కానీ మేము డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉంటే మా వద్దకి ధోని వచ్చేవాడు కాదు. సింగిల్‌గా కూర్చునే వాడు. సచిన్‌,  జహీర్‌ ఖాన్‌, నెహ్రా, యువరాజ్‌ ఇలా అంతా కలిసి చర్చించుకునే సమయంలో కూడా మాకు దూరంగా ఉండేవాడు. ఎప్పుడైతే మంకీ గేట్‌ వివాదం చెలరేగిందో అప్పట్నుంచి ధోని మాట్లాడటం ప్రారంభించాడు. మాకు సలహాలు ఇవ్వడమే కాకుండా మేము చేసే సూచనలు కూడా పట్టించుకునే వాడు. అందరికీ స్వేచ్ఛాయుత వాతావారణం ఇచ్చేవాడు . ఫీల్డ్‌లో బౌలింగ్‌ చేసేటప్పుడు నాకే కాదు.. దీపక్‌ చాహర్‌ కూడా ఫ్రీడమ్‌ ఇస్తాడు ధోని. ఇది ధోని నుంచి ప్రతీ ఒక్కరూ  నేర్చుకోవాల్సిన ప్రధాన లక్షణం. ఒక బౌలర్‌కు కానీ, బ్యాట్స్‌మన్‌కు కానీ స్వేచ్ఛనిస్తేనే అతను ఆటగలడు. ఆ విషయం ధోనికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు’ అని భజ్జీ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్‌లో తాను సీఎస్‌కేకు మారడంపై హర్భజన్‌ పెదవి విప్పాడు. 10 ఏళ్ల పాటు ముంబై ఇండియన్స్‌కు ఆడి 2018లో సీఎస్‌కే ధరించడం చాలా కొత్తగా అనిపించేదన్నాడు. సీఎస్‌కే నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో హర్భజన్‌ తన గత జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నాడు. (ధోని, కోహ్లిలపై యోగ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు