ధోనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోం!

14 Jul, 2017 14:30 IST|Sakshi
ధోనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోం!

చెన్నై: ఆయా జట్లతో 10 ఏళ్ల ఐపీఎల్ ఒప్పందం ముగియడంతో వచ్చే ఏడాది ఐపీఎల్‌ కోసం ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు. వచ్చే ఐపీఎల్‌పై చెన్నై టీమ్ ప్రతినిధి జార్జ్‌ జాన్‌ మాట్లాడుతూ... 'కాంట్రాక్టు ముగియడంతో ఆటగాళ్లు వేలంలో పాల్గొనాలి. అయితే ఓ ఆటగాడిని కచ్చితంగా పాత జట్టు తీసుకునే ఛాన్స్ ఉంటే మాత్రం సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనిని తీసుకుంటాం. ఈ ఏడాది పుణెతో ధోని కాంట్రాక్టు ముగుస్తుంది. జట్టును ముందుకు నడిపించే సమర్థవంతమైన వ్యక్తి ధోని. ఆయనపై పూర్తి విశ్వాసం ఉంది. కెప్టెన్‌గా ధోనిని, ప్రధాన కోచ్‌గా స్టీవెన్‌ ఫ్లెమింగ్‌ను తీసుకోవాలని ఫ్రాంచైజీ యోచిస్తోంది. త్వరలో మేనేజ్‌మెంట్ విషయంపై చర్చిస్తామని' వెల్లడించారు. అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన ప్లేయర్‌గానూ రికార్డు ధోని సొంతం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్లు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ 2018 ఐపీఎల్‌లో తిరిగి అడుగుపెట్టనున్నాయి. 2015లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో తీవ్రంగా స్పందించిన బీసీసీఐ ఆ రెండు జట్లపై రెండేళ్ల నిషేధం విధించింది. ఈ కారణంగా 2016, 2017 సీజన్లలో ఈ జట్లు ఆడలేదు. వీటి స్థానాల్లో గుజరాత్‌ లయన్స్‌, రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ వచ్చి చేరినా వాటి రెండేళ్ల కాంట్రాక్టు కాలం పూర్తవడంతో ఆ జట్లు రద్దయ్యాయి. మరోవైపు గురువారంతో చెన్నై, రాజస్థాన్ జట్లపై విధించిన నిషేధం గడువు ముగిసిపోయింది. ఈ విషయాన్ని చెన్నై ఐపీఎల్ జట్టు అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

 

>
మరిన్ని వార్తలు