‘ధోని సలహాతోనే బ్యాటింగ్ మార్చాడు’

9 Feb, 2019 16:18 IST|Sakshi

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా సునాయాసంగా గెలవడంలో పూర్తి క్రెడిట్‌ యువ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌కే ఇచ్చేశాడు వెటరన్‌ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌. రిషభ్‌ ధాటిగా ఆడటం వల్లే టీమిండియా ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా విజయాన్ని అందుకుందని ప‍్రశంసించాడు. కివీస్‌తో మ్యాచ్‌లో రిషభ్‌ ఆడిన తీరు అతన్ని వరల్డ్‌కప్‌ రేసులో కచ‍్చితంగా నిలుపుతుందని పేర్కొన్నాడు. అయితే రిషభ్‌ ఇన్నింగ్స్‌కు ధోనినే కారణమని భజ్జీ అన్నాడు.

‘రిషభ్ షాట్లను ఆడే సమయంలో ధోని సలహా ఎంతగానో ఉపకరించింది. ముందు రిషభ్‌ చాలా సాధారణమైన షాట్లు ఆడాడు. ఆ సమయంలో అతని వద్దకు వెళ్లిన ధోని షాట్ల ఎంపికలో కొన్ని సూచనలు చేశాడు. ప్రధానంగా జట్టుకు రిషభ్ అవసరాన్ని గుర్తు చేశాడు. అటు తర్వాత రిషభ్‌ తన బ్యాటింగ్‌ను మార్చాడు. ఎటువంటి ప్రమాదం లేని షాట్లను ఆడాడు. ప్రధానంగా గ్రౌండ్‌ షాట్లను ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఏ బంతిని హిట్‌ చేయాలో దాన్ని మాత్రమే బౌండరీ అవతలకు తరలించాడు. ఇక్కడ రిషభ్‌కు ధోని సూచన చాలా ఎక్కువగా ఉపయోగపడింది’ అని భజ్జీ తెలిపాడు. ఈ తరహా ఆటను మిగతా సిరీస్‌లో కూడా ఆడితే రిషభ్‌కు వరల్డ్‌కప్‌కు వెళ్లే భారత జట్టులో చోటు దక్కడం కష్టం కాదన్నాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రిషభ్‌ (40 నాటౌట్‌; 28 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్‌) ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు