ధోని జెర్సీ నంబర్‌ ఎవరికి?

25 Jul, 2019 10:33 IST|Sakshi
ఎంఎస్‌ ధోని ఫైల్‌ఫొటో

న్యూఢిల్లీ: వచ్చే నెల మొదటి వారంలో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఆరంభం కానున్న యాషెస్‌ సిరీస్‌లో క్రికెటర్లు తెల్ల జెర్సీలపై నంబర్లు, తమ పేర్లతో బరిలోకి దిగనున్నారు. టెస్టు క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మేరకు ఐసీసీ నిర్ణయం తీసుకుంది. దాంతో భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగనున్నటెస్టు సిరీస్‌లో కూడా ఆటగాళ్లు నెంబర్‌, పేరుతో కూడిన జెర్సీలు ధరించనున్నారు.  ఇరు జట్ల మధ్య జరుగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఆగస్టు 22న ఆంటిగ్వాలో మొదలవనుంది. వన్డేలు, టీ20ల్లో భారత ఆటగాళ్లు ఏ నెంబర్‌తో ఆడుతున్నారో ఆ నెంబర్‌తోనే టెస్టుల్లో కూడా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అంటే విరాట్‌ కోహ్లి 18, రోహిత్‌ 45 నెంబర్‌నే ఉపయోగించనున్నారు.(ఇక్కడ చదవండి: టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారి..)

అయితే టెస్టు ఫార్మాట్‌ నుంచి 2014లో రిటైరైన ధోనీ వన్డేలు, టీ20ల్లో ఏడో నెంబర్‌ జెర్సీని ఉపయోగిస్తున్నాడు. మరి టెస్ట్‌ల్లో ఆ ఏడో నెంబర్‌ ఎవ రు ధరిస్తారన్న చర్చ మొదలైంది. టెస్టులకు ఏడో నెంబర్‌ జెర్సీ అందుబాటులో ఉన్నా దానిని మరో క్రికెటర్‌ ఉపయోగించే అవకాశాలు తక్కువేనని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ‘ఏడో నెంబర్‌ జెర్సీకి ధోనికి అవినాభావ సంబంధం ఉందని అభిమానులు భావిస్తున్నారు. దాంతో ఏడో నంబర్‌ జెర్సీని ఎవరికీ కేటాయించకపోవ్చు. ఒక నెంబర్‌ జెర్సీకి బీసీసీఐ అధికారిక రిటైర్మెంట్‌ ప్రకటించే చాన్స్‌ లేదు. కానీ భారత క్రికెట్‌లో ధోని స్థాయి రీత్యా.. ఆ నెంబర్‌ జెర్సీని ఎవరికీ ఇవ్వకపోవచ్చు’ అని సదరు అధికారి తెలిపారు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ రిటైరయ్యాక అతడి పదో నెంబర్‌ జెర్సీని పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఉపయోగించడాన్ని సచిన్‌ అభిమానులు ఆక్షేపించారు. దాంతో ఆ నెంబర్‌ జెర్సీని వన్డేలు, టీ20ల్లో ఎవరూ ధరించకుండా బీసీసీఐ దానికి అనధికారిక రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు