300 మ్యాచ్‌లు... 30 మ్యాచ్‌లు

26 Oct, 2018 05:28 IST|Sakshi

చివరి ఓవర్‌ వ్యూహంపై కుల్దీప్‌ వ్యాఖ్య

విశాఖపట్నం:  రెండో వన్డే చివరి ఓవర్లో విజయానికి 14 పరుగులు చేయాల్సిన దశలో తొలి ఐదు బంతులకు వెస్టిండీస్‌ 9 పరుగులు రాబట్టింది. అనుకోకుండా వెళ్లిన లెగ్‌ బై బౌండరీని మినహాయిస్తే ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ కూడా ఆ ఐదు బంతులను ఆడటంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ ఓవర్‌కు వ్యూహ రచన చేసిన ధోని ఆఖరి బంతికి మాత్రం ఫీల్డింగ్‌ను మార్చేశాడు. థర్డ్‌మ్యాన్‌ను మరి కాస్త లోపలకు తీసుకొచ్చి పాయింట్‌ ఫీల్డర్‌ను డీప్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ వద్దకు పంపించాడు. స్వీపర్‌ కవర్, లాంగాఫ్‌ను కూడా తప్పించాడు. అయితే ఈ వ్యూహం వ్యతిరేకంగా పని చేసి ఆఖరి బంతిని హోప్‌ ఫోర్‌ కొట్టి మ్యాచ్‌ను ‘టై’ చేయగలిగాడు. ఇదే విషయంపై మ్యాచ్‌ తర్వాత మీడియా సమావేశంలో కుల్దీప్‌ యాదవ్‌ను ప్రశ్నించగా అతను సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదు.

‘ఇది ధోని ప్రణాళిక. దాని గురించి తెలిసేంత పెద్దవాడిని కాను. నేను 30 మ్యాచ్‌లు మాత్రమే ఆడాను. మహి భాయ్‌ 300 మ్యాచ్‌లు ఆడాడు. మా అందరికంటే అతనికి చాలా ఎక్కువ అనుభవం ఉంది. ఆ సమయంలో అతను అనుకున్నది అమలు చేశాడు’ అని కుల్దీప్‌ జవాబిచ్చాడు. దాదాపు పది నెలల క్రితం జరిగిన ఒక ఘటనను గుర్తు చేసుకొని కుల్దీప్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అనిపించింది. ఇండోర్‌లో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్‌లో ధోని ఫీల్డింగ్‌ మార్పులు చేస్తూ కవర్‌ను తప్పించి పాయింట్‌ను మరింత ముందుకు తీసుకు రమ్మని బౌలర్‌ కుల్దీప్‌కు సూచించాడు. అయితే దీనిని పట్టించుకోని కుల్దీప్‌ తనకు ఈ ఫీల్డింగ్‌ బాగుందని చెప్పాడు. దాంతో చిర్రెత్తిన ధోని ‘300 మ్యాచ్‌లు ఆడిన నేనేమైనా పిచ్చివాడినా’ అంటూ ఏడో మ్యాచ్‌ ఆడుతున్న కుల్దీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరో వైపు మంచు కారణంగా బంతిపై పట్టు చిక్కక పోవడం వల్లే గెలుపు చేజారిందని ఈ చైనామన్‌ బౌలర్‌ విశ్లేషించాడు.

మరిన్ని వార్తలు