'ఎంఎస్ ధోనినే కీలకం'

19 Sep, 2017 16:18 IST|Sakshi
'ఎంఎస్ ధోనినే కీలకం'

కోల్కతా: ఆస్ట్రేలియాతో చెన్నైలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో భారత జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో ధోని 79 పరుగులు వ్యక్తిగత స్కోరు సాధించి విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి  వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దాంతో టీమిండియా 281 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించకల్గింది.  ఈ క్రమంలోనే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో జరిగే రెండో  వన్డేలో ధోనిపై ఆసీస్  ప్రత్యేక దృష్టి సారించింది.

 

'రెండో వన్డేలో  ధోనినే మా టార్గెట్. ధోని వికెట్ చాలా కీలకమైనది. అతన్ని సాధ్యమైనంత తొందరగా అవుట్ చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం. ధోనిని తొందరగా పంపాలని తొలి వన్డేలో  చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈసారి ధోనిని ముందుగానే పెవిలియన్ కు పంపేందుకు కసరత్తులు  చేస్తున్నాం. టీమిండియా జట్టులో సుదీర్ఘకాలంగా ధోని విశేషమైన సేవలందిస్తున్నాడు. అదే అతనికి బలం. టెయిలెండర్లతో కలసి విలువైన భాగస్వామ్యాలు సాధిస్తున్నాడు. ధోనిని తొందరగా అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే పైచేయి సాధిస్తాం. గత మ్యాచ్ లో హార్దిక్  పాండ్యాతో కలిసి ధోని కీలక భాగస్వామ్యాన్ని జత చేశాడు.  వారి భాగస్వామ్యానికి బ్రేక్  వేసేందుకు శతవిధాలా ప్రయత్నం చేసినా ఫలించలేదు. తదుపరి మ్యాచ్ లో ధోనిని టార్గెట్ చేస్తూ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాం'అని స్పిన్నర్ ఆడమ్ జంపా తెలిపాడు.గురువారం భారత్-ఆస్ట్రేలియాల మధ్య కోల్ కతాలో రెండో వన్డే జరుగనుంది.

మరిన్ని వార్తలు