సమిష్టి కృషితో టీమిండియా విజయాలు

23 Jan, 2019 13:46 IST|Sakshi

బీసీసీఐ చీఫ్‌ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌

సాక్షి, చేబ్రోలు (పొన్నూరు): సమిష్టి కృషితో భారత క్రికెట్‌ జట్టు 70 ఏళ్ల తర్వాత విదేశాల్లో మంచి విజయాలు సాధించిందని భారత క్రికెట్‌ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. సోమరావం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులోని సెయింట్‌ మేరీస్‌ కళాశాలలో జాతీయస్థాయి సెయింట్‌ మేరీస్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెస్కే ప్రసాద్‌ హాజరై ప్రసగించారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాధన కోసం కృషి చేయాలని సూచించారు. ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్‌ పర్యటనకు ముందు జరిగిన పలు అంశాలను ఆయన ఈ సమావేశంలో వెల్లడించారు. క్రికెట్‌ జట్టు ఎంపిక సమయంలో బోర్డు సభ్యుల మధ్య సామరస్యమైన వాదనలు జరిగాయన్నారు.

ఒకటి రెండు ఎంపికల సమయంలో యువకులకు అవకాశం ఇవ్వాలని తాను ప్రయత్నించగా, మిగిలిన బోర్డు సభ్యులు, కెప్టెన్‌ కోహ్లి అనుభవం ఉన్న వారి కోసం పట్టుబట్టారన్నారు. అయితే సిరీస్‌ గెలిచిన తరువాత ఆ ఇద్దరు పనికిరాకుండా పోయారన్నారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు మిగిలిన సభ్యులు కూడా తరువాత జరిగిన పొరపాటును అంగీకరించటం వారి గొప్పదనమన్నారు. హనుమ విహారి, మయాంక్‌ అగర్వాల్‌ తదితరులు ఆస్ట్రేలియా సిరీస్‌లో తమ ప్రతిభను చూపారన్నారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కృషితో గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను తీర్చిదిద్దటం కోసం ప్రతి ఏటా రూ.4 కోట్ల ఖర్చుతో నాలుగు చోట్ల శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా