అదంతా ఒట్టి భ్రమే! 

31 Jul, 2019 01:43 IST|Sakshi

అనుభవం ఉన్నఆటగాడే సెలక్టర్‌ కానవసరం లేదు

సచిన్‌ను గుర్తించిన దుంగార్పూర్‌ ఎన్ని టెస్టులు ఆడారు? 

చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ఎదురుదాడి 

భారత క్రికెట్‌ జట్టు ఎంపిక, నాయకత్వ మార్పు గురించి ఎప్పుడు చర్చ జరిగినా సెలక్షన్‌ కమిటీ సభ్యుల కెరీర్‌పైనే అన్ని వైపుల నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. ఆరు టెస్టులే ఆడిన ఎమ్మెస్కే ప్రసాద్‌ ధోని కెరీర్‌ను శాసించడం ఏమిటంటూ సెలక్టర్ల సామర్థ్యంపైనే అందరూ విమర్శలు చేస్తుంటారు. తాజాగా క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే దీనిపై ఎమ్మెస్కే ఘాటుగా స్పందించారు. తమ కెరీర్‌ గణాంకాలకు సంబంధించి వస్తున్న విమర్శలపై స్పష్టంగా సమాధానమిస్తూ ఆయన ఎదురు దాడి చేశారు. తమ ఆటకు, జట్టు ఎంపికకు సంబంధం ఏమిటంటూ సూటిగా ప్రశ్నించారు.

న్యూఢిల్లీ : అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ క్రికెట్‌ ఆడిన వారికే సెలక్టర్లుగా బాగా పని చేసే సామర్థ్యం ఉంటుందనే ప్రచారంలో వాస్తవం లేదని భారత క్రికెట్‌ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. అదంతా ఒట్టి భమ్ర మాత్రమేనని ఆయన విశ్లేషించారు. టీమిండియా ఇటీవలి ప్రదర్శన, తమ బృందంపై వచ్చిన విమర్శలు తదితర అంశాలపై ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఎమ్మెస్కే మాటల్లోనే... 

సెలక్షన్‌ కమిటీ స్థాయి, సామర్థ్యం గురించి వచ్చిన విమర్శలపై... 
ఏదో ఒక ఫార్మాట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడి ఉండాలనేది మమ్మల్ని సెలక్టర్లుగా నియమించే సమయంలో పెట్టిన కనీస అర్హత. మా సభ్యులలో అందరికీ ఆ అర్హత ఉంది. దీంతో పాటు మేమందరం కలిసి 477 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాం. మా పదవీకాలంలో 200కు పైగా ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ప్రత్యక్షంగా చూశాం. ఆటగాళ్లుగానే కాకుండా సెలక్టర్లుగా ఇన్ని మ్యాచ్‌లు చూసిన అనుభవం సరైన  ప్రతిభను గుర్తించేందుకు సరిపోదా! 

ఐదుగురు కలిసి ఆడిన టెస్టుల సంఖ్య 13 మాత్రమే కావడంపై... 
నిజంగా అంతర్జాతీయ అనుభవం గురించే చెప్పుకోవాలంటే ఇప్పుడు ఇంగ్లండ్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎడ్‌ స్మిత్‌ ఒకే ఒక టెస్టు ఆడాడు. సుదీర్ఘ కాలం ఆస్ట్రేలియా చీఫ్‌ సెలక్టర్‌గా పని చేసిన ట్రెవర్‌ హాన్స్‌ 7 టెస్టులు మాత్రమే ఆడాడు. 128 టెస్టులు, 244 వన్డేలు ఆడిన మార్క్‌వా, 87 టెస్టులు ఆడిన మరో దిగ్గజం గ్రెగ్‌ చాపెల్‌ కూడా ట్రెవర్‌ నేతృత్వంలో పని చేశారు. ఆయా దేశాల్లో ఎవరూ పట్టించుకోని అనుభవం, స్థాయి మన వద్దకు వచ్చేసరికి ఎందుకు అవసరమవుతుంది? నా ఉద్దేశం ప్రకారం ప్రతీ పదవికి ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. అపార అంతర్జాతీయ అనుభవమే కొలమానమైతే ఒక్క టెస్టు కూడా ఆడని రాజ్‌సింగ్‌ దుంగార్పూర్‌లాంటి మహానుభావుడు చీఫ్‌ సెలక్టర్‌ అయ్యేవాడా? 16 ఏళ్ల వయసున్న సచిన్‌ టెండూల్కర్‌లాంటి ఒక వజ్రాన్ని ఆయన వెలికి తీసేవాడా? ప్రతిభను గుర్తించాల్సిన  సెలక్టర్‌కు స్థాయి, అంతర్జాతీయ అనుభవంతో పనేంటి.

సెలక్టర్లకు చేవ లేదంటూ సునీల్‌ గావస్కర్‌ చేసిన వ్యాఖ్యలపై... 
ఇది చాలా దురదృష్టకరం. దిగ్గజ క్రికెటర్లంటే మాకు ఎంతో గౌరవం ఉంది. వారు వెలిబుచ్చే ప్రతీ అభిప్రాయాన్ని తగిన విధంగా పరిగణలోకి తీసుకుంటాం కూడా. వారి ఆలోచనలు వారికి ఉండవచ్చు. అయితే ఇలాంటి మాటల వల్ల బాధ పడటంకంటే సెలక్షన్‌ కమిటీ మరింత బలంగా, అంకితభావంతో, కలిసికట్టుగా పని చేయడం ముఖ్యం.  

ఎంపిక విషయంలో కోహ్లి, శాస్త్రిలతో వచ్చే విభేదాలపై... 
ఎక్కువ క్రికెట్‌ ఆడిన వారికి ఎక్కువ పరిజ్ఞానం ఉంటుందని, అదే కారణంతో వారు సెలక్టర్లకు ఇబ్బంది పెడతారని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. అలా అయితే కోచ్‌ల నుంచి ఇతర సహాయక సిబ్బంది వరకు అంతా అనుభవం ఉన్న క్రికెటర్లతోనే నిండిపోయేది. ఎంపిక సమయంలో కోహ్లి, శాస్త్రి, ‘ఎ’ జట్టు కోచ్‌ ద్రవిడ్‌లతో చర్చించడం సహజం. సెలక్టర్లకు కూడా తమ పాత్ర ఏమిటో బాగా తెలుసు. అభిప్రాయ భేదాలు కూడా వస్తాయి కానీ బయటకు చెప్పం. నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో అక్కడే ఉండిపోతుంది. చివరకు భారత జట్టు ప్రయోజనాలే అన్నింటికంటే ముఖ్యం.  

గత మూడేళ్లలో సెలక్షన్‌ కమిటీ పనితీరుపై... 
మా సెలక్షన్‌ కమిటీ దేశంలోని మూలమూలకూ వెళ్లి ప్రతిభాన్వేషణ సాగించింది. ఒక పద్ధతిలో సరైన వారిని గుర్తించి భారత ‘ఎ’ జట్టులోకి, సీనియర్‌ జట్టులోకి తీసుకొచ్చింది. భారత జట్టు 13 టెస్టు సిరీస్‌లలో 11 గెలిచి గత మూడేళ్లుగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానంలో కొనసాగుతోంది. వన్డేల్లో విజయశాతం 80–85 మధ్యలో ఉండగా, ఇటీవలి ప్రపంచకప్‌ సెమీస్‌ పరాజయం వరకు నంబర్‌వన్‌గా నిలిచాం. చాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌ చేరడంతో పాటు రెండు సార్లు ఆసియా కప్‌ సాధించాం. ‘ఎ’ జట్టు 11 వన్డే సిరీస్‌లలో 11 కూడా గెలిస్తే, 9 టెస్టు సిరీస్‌లలో 8 నెగ్గింది. దాదాపు 35 మంది ఆటగాళ్లను గుర్తించి మూడు ఫార్మాట్‌లలో కూడా ఎంపిక చేశాం. ఇదంతా మా కమిటీ ఘనతగా చెప్పగలను.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్రికెట్‌కు వేణు గుడ్‌బై 

భారత హెడ్‌ కోచ్‌ పదవి రేసులో జయవర్ధనే! 

డోప్‌ టెస్టులో పృథ్వీ షా  విఫలం 

భారత యువతిని పెళ్లాడనున్న పాక్‌ క్రికెటర్‌ 

వచ్చేసింది.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 

యువీ సరదా ప్రశ్న.. ‘మీ ఇద్దరి పెళ్లెప్పుడు’

‘టీమిండియా కోచ్‌కు అవే ప్రధానం’

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

ప్రొఫెషనల్‌ క్రికెటర్లూ.. ఈ క్యాచ్‌ను నోట్‌ చేసుకోండి!

కోహ్లి.. నీకిది తగదు!

గావస్కర్‌కు మంజ్రేకర్‌ కౌంటర్‌!

యువరాజ్‌ దూకుడు

ఎఫైర్ల వివాదంలో పాక్‌ క్రికెటర్‌ క్షమాపణలు

గేల్‌ మెరుపులు.. ఆకాశంలో ఉరుములు!

‘టీమిండియాకు గట్టిపోటీ తప్పదు’

దీపా కర్మాకర్‌ ఇంకా కోలుకోలేదు

సహజశ్రీకి డబ్ల్యూఐఎం హోదా

కావ్య, నందినిలకు స్వర్ణాలు

అంతా నాన్సెన్స్‌ : రవిశాస్త్రి

వైదొలిగిన సింధు

16 ఏళ్ల రికార్డు బద్దలు

గట్టెక్కిన పట్నా పైరేట్స్‌

రోహిత్‌తో విభేదాలు.. అబద్ధపు ప్రచారమని కోహ్లి ఆవేదన

బెంగాల్‌ చేతిలో పుణెరి చిత్తుచిత్తుగా..

టెస్టు చాంపియన్‌షిప్‌పై స్పందించిన కోహ్లి

తమిళ్‌ తలైవాస్‌కు పట్నా షాక్‌

అలాంటిదేమి లేదు.. కోహ్లి వివరణ

ఆఫ్రిది ఆగయా.. బౌండరీ జాయేగా..

ఇదేమి సెలక్షన్‌ కమిటీరా నాయనా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి

నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే...

బిగ్‌బాస్‌ హౌస్‌లో వంటగ్యాస్‌, నీళ్లు కట్‌

‘ప్రేమ చూపిస్తున్నారా.. దాడి చేస్తున్నారా?’